ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2025లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన “క్వీన్ ఆఫ్ బిటాస్” అనే అందాల పోటీకి సంబంధించినది

72వ ఎడిషన్ మిస్ వరల్డ్ అందాల పోటీలకు తెలంగాణ రాష్ట్రం వేదిక అయ్యింది. 10 మే 2025న హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు ప్రారంభమయ్యాయి (ఇక్కడ, ఇక్కడ). 07 మే 2025 నుండి 31 మే 2025 వరకు జరగనున్న ఈ అందాల పోటీల్లో ప్రపంచంలోని దాదాపు 110 దేశాల నుండి సుందరీమణులు పాల్గొంటారు (ఇక్కడ). భారతదేశం తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీ 01 జూన్ 2025న హైటెక్స్‌లో జరగనుంది (ఇక్కడ). ఈ నేపథ్యంలో, తెలంగాణలో జరిగిన ఓ అందాల పోటీ దృశ్యాలుగా పేర్కొంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణలో జరిగిన ఓ అందాల పోటీకి సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో తెలంగాణకు సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియో ఇటీవల ఏప్రిల్ 2025లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన “క్వీన్ ఆఫ్ బిటాస్ (Queen of Bitas)” అనే ఓ అందాల పోటీకి సంబంధించినది. అలాగే ఈ వీడియోలో కనిపిస్తుంది ఫిలిప్పీన్స్‌కు చెందిన “Yeng Lavitoria (యెంగ్ లావిటోరియా)” అనే ట్రాన్స్‌జెండర్ మోడల్. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో  మోడల్ ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు  ‘Yeng Lavitoria’ అని ఉండటం చూడవచ్చు. దీని ఆధారంగా గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేస్తే, Yeng Lavitoria (యెంగ్ లావిటోరియా) ఫిలిప్పీన్స్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ మోడల్ అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ). యెంగ్ లావిటోరియాకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. ఈ ఖాతాలలో ఉన్న ఆమె ఫోటోలు, వీడియోలను వైరల్ వీడియోతో పోల్చి చూస్తే, వైరల్ వీడియోలో ఉన్నది యెంగ్ లావిటోరియా అని మనం నిర్ధారించవచ్చు.   

 తదుపరి, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను మరో కోణంలో చూపిస్తున్న అధిక నిడివి గల వీడియో (ఆర్కైవ్డ్ లింక్) ఒకటి లభించింది. ఈ వీడియోను ‘Amanda Page’ అనే ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫేస్‌బుక్ పేజీ 30 ఏప్రిల్ 2025న షేర్ చేసింది. ఈ వీడియో LGBTQ 2025, QUEEN OF BITAS అనే అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయబడింది.

పై సమాచారం ఆధారంగా మరింత వెతకగా (ఇక్కడ, ఇక్కడ), అలాగే ఈ ఫేస్‌బుక్ పేజీలోని మరిన్ని వీడియోలను పరిశీలించగా (ఇక్కడ, ఇక్కడ), ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2025లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన “క్వీన్ ఆఫ్ బిటాస్ (Queen of Bitas)” అనే ఓ అందాల పోటీకి సంబంధించినది తెలిసింది.

ఇకపోతే హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల నేపథ్యంలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోకు మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే వీడియోలో కనిపిస్తున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన “Yeng Lavitoria (యెంగ్ లావిటోరియా)” ఈ అందాల పోటీలో పాల్గొనడం లేదు. మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో పాల్గొంటున్న వారి వివరాలను ఇక్కడ చూడవచ్చు. అలాగే, మిస్ వరల్డ్ 2025 అందాల పోటీ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియో ఇటీవల ఏప్రిల్ 2025లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన “క్వీన్ ఆఫ్ బిటాస్ (Queen of Bitas)” అనే ఓ అందాల పోటీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.