వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ముర్షిదాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు 12 ఏప్రిల్ 2025న ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
ఈ అల్లర్ల నేపథ్యంలో, “పశ్చిమ బెంగాల్‌లోని ఒక మసీదు హిందువులను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయమని లౌడ్ స్పీకర్ల ద్వారా ఆదేశించిన వెంటనే, హిందువులు భయంతో ఆ గ్రామం నుండి పారిపోవడం ప్రారంభించారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా, కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులతో సహా చాలా మంది పరిగెత్తుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లోని ఒక మసీదు హిందువులను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయమని లౌడ్ స్పీకర్ల ద్వారా ఆదేశించిన వెంటనే, హిందువులు భయంతో ఆ గ్రామం నుండి పారిపోతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలోని హన్స్‌ఖాలీ బ్లాక్ (మండలం)లో ఉన్న మయూర్‌హాట్ (Mayurhat) అనే గ్రామంలో ఇటీవల 14/15 ఏప్రిల్ 2025న జరిగిన చరక్ పూజకు సంబంధించినవి. ఇదే విషయాన్ని మయూర్‌హాట్-1 పంచాయతీ సర్పంచ్ దీపాంకర్ దాస్ Factlyతో పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ దృశ్యాలు ఏదైనా ఊరేగింపు లేదా ఏదైనా హిందూ ఉత్సవానికి సంబంధించినది కావచ్చని స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియోలో టైంస్టాంప్ 00:25 వద్ద ఒక వ్యక్తి ధూపం వేస్తూ పరుగెత్తడం, కొందరు నల్లటి దుస్తులు ధరించి రాక్షసుల వేషధారణలో ఆ వ్యక్తి వెనకాలే పరుగెత్తడం, అలాగే టైంస్టాంప్ 01:15 వద్ద ఒక ఒక వ్యక్తి డోలు వాయిస్తూ ఆ గుంపుతో వెళ్ళడం మనం చూడవచ్చు.
ఈ వైరల్ వీడియోలో కనిపుస్తున్న భవనంపై బెంగాలీలో ‘మయూర్‌హాట్ యాత్రీ ప్రతియాల్లం (ময়ূরহাট যাত্রী প্রতীয়ল্লম’). మయూర్‌హాట్ (Mayurhat) అనేది పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలోని హన్స్‌ఖాలీ బ్లాక్ (మండలం)లో ఉన్న ఒక గ్రామం. ఈ సమాచారం ఆధారంగా మేము గూగుల్ మ్యాప్స్‌లో వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతాన్ని జియోలొకేట్ చేశాము. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను మయూర్‌హాట్ గ్రామానికి సంబంధించినవిగా మనం నిర్ధారించవచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం మేము మయూర్‌హాట్-1 పంచాయతీ ప్రధాన్ (సర్పంచ్) దీపాంకర్ దాస్‌ను సంప్రదించాము, మాతో (Factly) మాట్లాడుతూ, “వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల 14 లేదా 15 ఏప్రిల్ 2025న తమ (మయూర్‌హాట్) గ్రామంలో జరిగిన చరక్ పూజ/ఉత్సవంకు సంబంధించినవి, మయూర్‌హాట్ పరిధిలోని ఏ మసీదు కూడా హిందువులను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయమని హెచ్చరించలేదు” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆయన చరక్ పూజ అంటే ఏంటే కూడా మాకు వివరించారు. ఈ చరక్ పూజను ప్రతి సంవత్సరం మయూర్‌హాట్ గ్రామంలో నిర్వహిస్తారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
చివరగా, ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలోని హన్స్‌ఖాలీ మండలంలో ఉన్న మయూర్‌హాట్ అనే గ్రామంలో ఇటీవల 14/15 ఏప్రిల్ 2025 జరిగిన చరక్ పూజకు సంబంధించినది.