ఈ వైరల్ ఫోటో 22 డిసెంబర్ 2024న ఢిల్లీలోని క్వాలిటీ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ తన కుటుంబంతో కలిసి లంచ్‌కి వెళ్లినప్పుడు తీసింది

26 డిసెంబర్ 2024న, తీవ్ర అస్వస్థతకు గురైన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆయన రాత్రి 9.51 గంటలకు మరణించారు (ఇక్కడ & ఇక్కడ). ఆయన మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం 26 డిసెంబర్ 2024 నుండి 01 జనవరి 2025 వరకు 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే,“మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల్లో రాహుల్ గాంధీ/సోనియా గాంధీ కుటుంబం వియత్నాం పర్యటనకు వెళ్ళింది”  అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల్లో అనగా 26 డిసెంబర్ 2024 నుండి 01 జనవరి 2025 మధ్య రాహుల్ గాంధీ/సోనియా గాంధీ కుటుంబం వియత్నాం పర్యటనకు వెళ్ళింది, అందుకు సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో 22 డిసెంబర్ 2024న ఢిల్లీలోని క్వాలిటీ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ తన కుటుంబంతో కలిసి లంచ్‌కి వెళ్లినప్పుడు తీయబడింది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ 26 డిసెంబర్ 2024న మరణించారు. మన్మోహన్ సింగ్ మరణానంతరం ఆయన సంతాప దినాల్లో అనగా 26 డిసెంబర్ 2024 నుండి 01 జనవరి 2025 మధ్య రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్ళినట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోను రిపోర్ట్ చేస్తూ “ఢిల్లీలోని ఐకానిక్ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ ఫ్యామిలీ లంచ్అనే శీర్షికతో 22 డిసెంబర్ 2024న ఎన్డీటీవీ (NDTV) వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన వార్తా కథనం (ఆర్కైవ్డ్) ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వైరల్ ఫోటో 22 డిసెంబర్ 2024న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ కుటుంబాలు ఢిల్లీలోని దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రసిద్ధ క్వాలిటీ రెస్టారెంట్‌ను సందర్శించినప్పుడు తీసినది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సోనియా గాంధీ, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా మరియు ప్రియాంక గాంధీ అత్త మౌరీన్ కూడా ఉన్నారని, గాంధీ కుటుంబం క్వాలిటీ రెస్టారెంట్‌లో చోలే-భాతురే మరియు ఇతర వంటకాలను తిన్నట్లు ఈ కథనం పేర్కొంది.

22 డిసెంబర్ 2024న రాహుల్ గాంధీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే ఫోటోను షేర్ (ఆర్కైవ్డ్) చేస్తూ “ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో కుటుంబ భోజనం. మీరు వెళితే చోలే భాతురే ప్రయత్నించండి”అని పేర్కొన్నారు (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా). రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబంతో కలిసి ఢిల్లీలోని క్వాలిటీ రెస్టారెంట్‌ను 22 డిసెంబర్ 2024న సందర్శించి అక్కడ లంచ్ చేసినట్లు పేర్కొంటూ ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

పలు వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), మాజీ ప్రధాని మన్మోహన్‌కు సంతాపం తెలియజేస్తున్న సమయంలో  కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ X(ట్విట్టర్)లో స్పందిస్తూ “రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన కోసం వియత్నాం వెళ్లారు, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తే మీకెందుకు అంత బాధ కలుగుతుంది” అని అన్నారు.

చివరగా, ఈ వైరల్ ఫోటో 22 డిసెంబర్ 2024న ఢిల్లీలోని క్వాలిటీ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ తన కుటుంబంతో కలిసి లంచ్‌కి వెళ్లినప్పుడు తీయబడింది. మన్మోహన్ సింగ్ మరణానంతరం ఆయన సంతాప దినాలలో రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్ళినట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి.