వైరల్ అవుతున్న ఈ చంద్రుని ఫోటోని ఒక సంవత్సర నిడివిలో తీశారు, వరుసగా 28 రోజుల పాటు కాదు

రాత్రివేళ ఆకాశంలో వివిధ స్థానాల్లో చంద్రుడు కనిపిస్తున్న ఫోటో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని ఒక ఫోటో గ్రాఫర్ ‘వరుసగా 28 రోజుల పాటు ఒకే ప్రదేశంలో మరియు అదే సమయంలో క్యాప్చర్’ చేశాడు అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో  ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఒక ఫోటోగ్రాఫర్ చంద్రుని ఫోటోను వరుసగా 28 రోజుల పాటు ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో క్యాప్చర్ చేయగా, ఈ చిత్రాల శ్రేణి ఏర్పడింది.

ఫ్యాక్ట్(నిజం):  ఈ ఫొటోని జార్జియా హఫర్ అనే ఇటాలియన్ ఆస్ట్రో-ఫోటోగ్రాఫర్ తీశారు. ఈ 28 ఫోటోల కాంపోజిట్ చిత్రించటానికి తనకు సంవత్సర కాలం పట్టింది అని తను సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.   

ముందుగా, వైరల్ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ఇంటర్నెట్లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా ఇదే ఫోటో ఉన్న 2018 నాటి ఒక ఇటాలియన్ ఆర్టికల్ లభించింది (ఆర్కైవ్ లింక్). దీనిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి చదవగా, ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి పేరు జార్జియా హఫర్ అని తెలిసింది. అలాగే ఈ ఫోటో పైన ‘జార్జియా హఫర్ ఫోటోగ్రఫీ’ అనే వాటర్ మార్క్ కూడా ఉండటాన్ని మేము గమనించాము.

ఈ ఆర్టికల్ ప్రకారం, ఈ ఫోటో 28 భిన్నమైన ఫోటోలు కాంపోజిట్. ఇటలీలో ఉన్న క్రీడోల పర్వతాల పైన ఆకాశంలో, మారుతున్న చంద్రుని స్థానం మరియు, చంద్రుని యొక్క రకరకాల దశలను ఇందులో మనం చూడవచ్చు.

ఇదే ఫొటోని జార్జియా తన వెబ్సైటులో మరియు సోషల్ మీడియా పేజీలలో(ఇక్కడ, ఇక్కడ) పోస్ట్ చేశారు(ఆర్కైవ్ లింక్). ఈ ఫోటోలను ఎలా తీశారు అని ఈ పోస్టులలో వివరిస్తూ, ఆకాశంలో చంద్రుని యొక్క స్థానాన్ని(పొజిషన్) 27 రోజుల పాటు తను ప్రతి 1481 నిమిషాలకు, అంటే 24 గంటల,41 నిమిషాలకు ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి లెక్కపెట్టారు. కానీ వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా, ఈ 27 స్థానాల్లో చంద్రుడిని తను వరుసగా 28 రోజుల పాటు ఒకే స్థలంలో ఒకే సమయంలో ఫోటో తీయలేదు. ఈ ఫొటోలని తీయడానికి తనకు సంవత్సర కాలం పట్టింది. కొన్ని ఫోటోలు తను జనవరి 2017లో తీస్తే, కొన్ని ఫోటోలను తను జూలై 2017 నుంచి డిసెంబర్ 2017 మధ్యలో తీశారు. 

ఈ ఫోటోలో మనకు కనిపించేది ‘లూనార్ కర్వ్’ అని, ఒక పూర్తి ‘చంద్ర మాసం’(synodic month) కాదు అని జార్జియా తన పోస్టులలో మరియు ఆర్టికల్‌లో పేర్కొన్నారు.అయితే, వైరల్ ఫోటోను తీసిన తర్వాత సంవత్సరం, 2019లో తను Synodic month అంటే చంద్ర మాసాన్ని చిత్రించారు. ఆ ఫొటోని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

చివరిగా, వైరల్ అవుతున్న ఈ చంద్రుని ఫోటోని ఒక సంవత్సర నిడివిలో తీసారు, వరుసగా 28 రోజుల పాటు కాదు.