ఈ వీడియో జూలై 2024లో కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రవాణా సమయంలో కార్గో బాక్స్ నుండి ఈల్స్ పడిపోయిన దృశ్యాలను చూపిస్తుంది

“లుఫ్తాన్స ఎయిర్‌లైన్స్ ద్వారా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో పాములను దిగుమతి చేసుకుంటున్నారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో మనం పాములు లాంటి జీవులు జారిపోయి, విమానాశ్రయంలోని టార్మాక్‌పై పడిపోవడం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లుఫ్తాన్స ఎయిర్‌లైన్స్ ద్వారా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో పాములను దిగుమతి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నవి పాములు కావు. అలాగే ఈ వీడియో అమెరికాకు సంబంధించింది కాదు. జూలై 2024లో కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రవాణా సమయంలో కార్గో బాక్స్ నుండి ఈల్స్ పడిపోయిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటి దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ “కెనడా విమానాశ్రయం యొక్క టార్మాక్‌పై ఈల్స్ మెలికలు తిరుగుతున్నట్లు చూపుతున్న వీడియోపై ఇంటర్నెట్ సంచలనం” (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా) అనే శీర్షికతో  12 జూలై 2024న ‘ఇండియా టీవీ’ ప్రచురించిన వార్తాకథనం లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియో కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రవాణా సమయంలో కార్గో బాక్స్ దెబ్బతినడం వల్ల అందులో నుండి ఈల్స్ జారి విమానాశ్రయంలోని టార్మాక్‌పై (విమానాలు పార్క్ చేసే స్థలం) పడిపోయిన దృశ్యాలను చూపిస్తుంది.

ఈ ఈల్స్ టొరంటో నుంచి వాంకోవర్ నగరానికి ఎయిర్ కెనడా కార్గో విమానం ద్వారా రవాణా చేయబడ్డాయి. ఈ కార్గో బాక్స్ కన్వేయర్ బెల్ట్ మీద ఉండగా బాక్స్ దెబ్బతినడం వల్ల ఈల్స్ బయటకు వచ్చాయి అని ఈ కథనం పేర్కొంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ జూలై 2024లో ప్రచురించబడిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ఘటనని మరొక యాంగిల్ లో చూపిస్తున్న వీడియోను పలు మీడియా సంస్థలు పబ్లిష్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలను వైరల్ వీడియోను పోల్చి చూస్తే రెండూ ఒకే సంఘటను చూపిస్తున్నాయని స్పష్టమవుతుంది. దీన్ని బట్టి వైరల్ వీడియో జూలై 2024లో కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రవాణా సమయంలో కార్గో బాక్స్ నుండి ఈల్స్ పడిపోయిన దృశ్యాలను చూపిస్తుందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, జూలై 2024లో కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రవాణా సమయంలో కార్గో బాక్స్ నుండి ఈల్స్ పడిపోయిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.