Fake News, Telugu
 

ఈ వీడియో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ASI ముష్తాఖ్ అహ్మద్ మృతదేహం ముందు అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యాలకు సంబంధించినది

0

BSF జవాన్ నరేందర్ రెడ్డి శవ పేటిక ముందు అతని కుటుంబ సభ్యులు భోరున  విలపిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. నరేందర్ రెడ్డి జమ్మూ & కశ్మీర్‌లో గత మూడు సంవత్సరాలుగా విధినిర్వహణలో ఉన్నారని, అక్కడి చలికి ఆరోగ్యం క్షిణించిపోవడంతో ఇటీవల తన ఇంటికి తిరిగివస్తుండగా మహారాష్ట్ర సరిహద్దులోని పలస అనే పట్టణంలో నరేందర్ రెడ్డి చనిపోయినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: BSF జవాన్ నరేందర్ రెడ్డి శవ పేటిక ముందు అతని కుటుంబ సభ్యులు భోరున  విలపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): శ్రీనగర్‌ ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన ASI ముష్తాఖ్ అహ్మద్ మృతదేహం ముందు అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో తెలుపుతున్న BSF జవాన్ నరేంద్ర రెడ్డి 2020 సంవత్సరంలో ఆరోగ్య సమస్యల కారణంగా మహారాష్ట్ర బలార్షాలోని చంద్రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘దేవభూమి డైలాగ్’ అనే మీడియా సంస్థ 14 జులై 2022 నాడు తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన ASI ముష్తాఖ్ అహ్మద్ శవపేటిక ముందు అతని కుటుంబసభ్యులు రోధిస్తున్న దృశ్యాలని ఈ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో మరికొందరు జర్నలిస్టులు కూడా ట్వీట్ చేసారు.

ఈ వివరాల ఆధారంగా వీడియోకి  సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని ‘నవభారత్ టైమ్స్’ సహా మరికొన్ని వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్ మరియు యూట్యూబ్ ఛానెల్స్‌లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. శ్రీనగర్‌లోని లాల్ బజార్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న ముష్తాఖ్ అహ్మద్ ఇటీవల జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో మరణించారని ఈ రిపోర్టులలో తెలిపారు. ఇవి ముష్తాఖ్ అహ్మద్ మృతదేహం ముందు అతని భార్య కుటుంబసభ్యులు విలపిస్తున్న దృశ్యాలని ఈ న్యూస్ రిపోర్ట్స్ తెలిపాయి. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ రిపోర్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

పోస్టులో తెలుపుతున్న BSF జవాన్ నరేంద్ర రెడ్డి 2020 సంవత్సరంలో ఆరోగ్య సమస్యల కారణంగా మహారాష్ట్ర బలార్షాలోని చంద్రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిసింది. అనంతపురం గజ రాంపల్లి గ్రామానికి చెందిన మేకల నరేంద్ర రెడ్డి, జమ్మూ &కాశ్మీర్లోని నియంత్రణ రేఖ దగ్గర విధులు నిర్వహించేవాడని  తెలిసింది. 2020 జనవరి నెలలో తన  కుటుంబాన్ని చూసేందుకు రైలులో వస్తుండగా నరేంద్ర రెడ్డి ఆరోగ్య సమస్యలతో బలార్షాలో మరణించినట్టు ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’ రిపోర్ట్ చేసింది. పోస్టులో తెలిపిన కథ 2020లో జరిగిన పాత సంఘటనను వివరిస్తుంది. 

చివరగా, శ్రీనగర్‌ ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన ASI ముష్తాఖ్ అహ్మద్ శవ పేటిక ముందు అతని కుటుంబ సభ్యులు రోధిస్తున్న వీడియోని సంబంధం లేని పాత ఘటనకు జోడిస్తూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll