ఆగష్టు 2025లో తెలంగాణలో వేర్వేరు విద్యుదాఘాత ఘటనలలో పలువురు మృతి చెందిన నేపథ్యంలో, 28 ఆగష్టు 2025న వినాయకుడి విగ్రహం కరెంటు తీగలకు తగిలి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొమ్మిది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 28 ఆగష్టు 2025న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్‌తో తొమ్మిది మందికి పైగా చనిపోవడాన్ని చూపుతున్న వీడియో.
ఫాక్ట్: వైరల్ వీడియో జగిత్యాల జిల్లా కోరుట్లలో 15 జూన్ 2025న జరిగిన విద్యుత్ ప్రమాదాన్ని చూపుతుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఘటనకి సంబంధించిన పలు మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ ఘటన 15 జూన్ 2025లో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది.
వివరాలలోకి వెళ్తే, కోరుట్ల పట్టణంలో 15 జూన్ 2025న వినాయక విగ్రహాలు తయారు చేసే సంస్థకు చెందిన వ్యక్తులు విగ్రహాన్ని తరలిస్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలు విగ్రహానికి తగలడంతో అక్కడే ఉన్న ఆ సంస్థ యజమాని వినోద్‌తో పాటు సాయి కుమార్ అనే కార్మికుడు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడగా, వారిని జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆసుపత్రులకి తరలించి చికిత్స అందించారు. స్థానిక నాయకులు, అధికారులు బాధితులని పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.
అలాగే, వైరల్ వీడియో గురించి కోరుట్ల పోలీసులను సంప్రదించగా ఈ ఘటన 15 జూన్ 2025న జరిగిందని, ఇందులో ఇద్దరు మృతి చెందగా, గాయపడినవారు కోలుకున్నారని తెలియజేశారు. డేటాఫుల్ గణాంకాల ప్రకారం, 2015 నుంచి 2022 వరకు తెలంగాణలో 5,792 విద్యుదాఘాత ఘటనలు నమోదు అయ్యాయి.
చివరిగా, వైరల్ వీడియో కోరుట్లలో 15 జూన్ 2025న జరిగిన విద్యుత్ ప్రమాదాన్ని చూపుతుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.