పాము అరుస్తున్నట్టు ఉన్న ఈ వీడియోకి కరీంనగర్ కి ఎటువంటి సంబంధం లేదు

YouTube Poster

కరీంనగర్ లో వింత శబ్దాలు చేస్తున్న పాము వీడియో అంటూ NTV ప్రచురించిన కథనాన్ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఇదే వీడియోని ప్రముఖ తెలుగు న్యూస్ చానల్స్, ABN మరియు ఇతర న్యూస్ చానల్స్ కూడా ‘కరీంనగర్ లో పాము వింత అరుపులు’ అంటూ కథనాలు ప్రచురించాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరీంనగర్ లో వింత శబ్దాలు చేస్తున్న పాము వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోకి కరీంనగర్ కి ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియో నెల క్రితమే యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడి ఉంది. ఈ వీడియో కరీంనగర్ లోని వెలిచాలలో జరిగిన ఘటనగా ఒక ఆకతాయి సోషల్ మీడియాలో షేర్ చేసాడని, అతనికి విచారిస్తున్నామని అక్కడి ఎస్సై వివేక్ తెలిపినట్టు వార్త కథనాలు ప్రచురించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకి కరీంనగర్ కి ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని మైక్ మార్టిన్ అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ లో 5 మే 2021న అప్లోడ్ చేసినట్టు తెలిసింది. ‘హాగ్నోస్ హిట్స్‌ ద హై నోట్స్‌’ అనే టైటిల్ తో ఈ వీడియోని అప్లోడ్ చేసాడు.

ఈ వీడియో ఆధారంగా యూట్యూబ్ లో వేతకగా హాగ్నోస్ పాము వీడియోస్ మరికొన్ని (ఇక్కడ మరియు ఇక్కడ)  కనిపించాయి. ఈస్టర్న్ హాగ్నోస్ అనేది ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడా దేశాల్లో కనబడుతుందని, ఇవి విషపూరిత పాములు కావని ఇక్కడ, ఇక్కడ చదవొచ్చు. అంతే కాదు, వీటిని ఎవరన్నా బెదిరిచ్చినప్పుడు, అవి మెడను లేపి గట్టిగా ‘హిస్’ శబ్దం చేస్తాయని కూడా అమెరికాకు పరిశోధన వెబ్సైటులో ఉంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో కరీంనగర్ లోని వెలిచాలలో జరిగిన ఘటనగా వైరల్ అయిన నేపథ్యంలో, ఈ వీడియో కరీంనగర్ కి సంబంధించింది కాదని, ఎవరో ఒక ఆకతాయి ఈ వీడియోని సోషల్ మీడియా పోస్టు చేసాడని, అతని విచారిస్తున్నామని ఎస్సై వివేక్ తెలిపినట్టు TV9 కథనం రాసింది. 

చివరగా, పాము అరుస్తున్నట్టు ఉన్న ఈ వీడియోకి కరీంనగర్ కి ఎటువంటి సంబంధం లేదు.