“ఇటీవల ఫిబ్రవరి 2025లో, తెలంగాణ పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను ఒక పోలీసు అధికారి చెంపదెబ్బ కొట్టాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో మీడియా సమావేశంలో ఒక నిందితురాలిని ఓ పోలీసు అధికారి చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల ఫిబ్రవరి 2025లో, తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఒక కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను ఒక పోలీసు అధికారి చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఇటీవలది కాదు. ఇది 17 ఫిబ్రవరి 2018న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ దొంగతనం కేసులో నిందితురాలైన మంగ అనే మహిళను అప్పటి బేగంపేట ఏసీపీ రంగారావు చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలను చూపిస్తుంది. మార్చి 2023లో, ఈ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్న మహిళలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 17 ఫిబ్రవరి 2018న తెలుగు మీడియా సంస్థ ‘ఈటీవీ తెలంగాణ’ యొక్క అధికారిక అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో “బేగంపేట ఏసీపీ రంగారావు మహిళల దొంగను చెంపదెబ్బ కొట్టాడు | సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్” అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, బొల్లారం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ దొంగతనం కేసులో నిందితురాలిని అప్పటి బేగంపేట ఏసీపీ రంగారావు చెంపదెబ్బ కొట్టాడు.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వార్తాకథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం,17 ఫిబ్రవరి 2018న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ నగల షాపులో జరిగిన దొంగతనం కేసులో బి.మంగ, స్వాతి మరియు రాణి అనే ముగ్గురు మహిళలను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు, ఈ మీడియా సమావేశం జరుగుతుండగా ఈ కేసులో నిందితురాలుగా ఉన్న మంగ అనే మహిళ తనకు ఈ కేసుతో సంబంధం లేదని మీడియాకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన అప్పటి బేగంపేట ఏసీపీ రంగారావు మంగను మీడియా ఎదుటే చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా, ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు, నార్త్ జోన్ DCP సుమతి జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇచ్చారు, దీంతో నిందితురాలైన మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ACP రంగారావును హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారని ఈ కథనాలు పేర్కొన్నాయి.
తదుపరి మేము ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సంఘటనకు సంబంధించి బొల్లారం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడిన FIR కాపీని మేము పరిశీలించాము. FIR ప్రకారం, 09 ఫిబ్రవరి 2018న బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పయోనీర్ బజార్ లో ఉన్న నగల దుకాణంలో (Arihant Jewellers) జరిగిన చోరీ కేసులో వీరిని నిందుతులుగా పేర్కొంటూ బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చోరీకికి సంబంధించి నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.
ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల తెలుసుకోవడానికి మేము ఈ-కోర్ట్స్(e-courts) వెబ్‌సైట్‌ను సందర్శించాము, ఇక్కడ లభించిన సమాచారం ప్రకారం, ఈ కేసులో, పోలీసులు బుట్టి మంగను A1గా, పి. ఎలిజబెత్ రాణిని A2గా, ఎం. స్వాతిని A3గా, కె. భాగ్యమ్మను A4గా నిందితులుగా పేర్కొంటూ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిసింది. ఈ కేసు విచారణలో ఉండగానే A1గా బుట్టి మంగ మృతి చెందింది.
ఈ కేసును విచారించిన సికింద్రాబాద్ 10వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులోని 22వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, మార్చి 2023లో, ఈ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్న మహిళలను నిర్దోషులుగా విడుదల చేశారు.
చివరగా, ఒక మీడియా ఓ దొంగతనం కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను ఒక పోలీసు అధికారి చెంపదెబ్బ కొట్టిన ఈ వీడియో 2018 నాటిది.