ఒక గొరిల్లా ఒక మహిళకు బిడ్డను అప్పగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). “గొరిల్లా చూడండి ఎంత ప్రేమగా పసివాడిని వాళ్ళ అమ్మకి ఇస్తుందో” అంటూ ఇది నిజమైన ఘటనగా పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: గొరిల్లా ఒక మహిళకు బిడ్డను అప్పగిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న గొరిల్లా, మహిళ కదలికలు అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. అలాగే వీడియోలో గొరిల్లా బిడ్డను మహిళకు అప్పగిస్తున్నప్పుడు గొరిల్లా చేయి, మహిళ చేయి కలిసిపోవడాన్ని మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.
ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియో లభించింది. ఈ వీడియో (ఆర్కైవ్డ్), 29 జూన్ 2025న, ‘@AI-Videos-Arg’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ‘Zoo Gorilla Gives Baby Back To Mother’ అనే శీర్షికతో అప్‌లోడ్ చేయబడినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడిందని పేర్కొనబడింది. అలాగే, ఛానెల్ వివరణలో కూడా ఈ ఛానెల్‌లోని వీడియోలు AI సహాయంతో రూపొందించినవిగా పేర్కొన్నారు. ఈ ఛానెల్‌లో మనం ఇలాంటి AI జనరేటెడ్ వీడియోలను చాలా చూడవచ్చు.
తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 99.4% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, గొరిల్లా ఒక మహిళకు బిడ్డను అప్పగిస్తున్న దృశ్యాలు అంటూ ఒక AI జనరేటెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు.