ఒక ఆవు రోడ్డుపై స్కూటర్ నడుపుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది దీన్ని నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రోడ్డుపై ఒక ఆవు స్కూటర్ నడుపుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. దీంట్లోని దృశ్యాలు AI ద్వారా రూపొందించబడ్డాయని Hive AI-డిటెక్షన్ టూల్ కూడా నిర్ధారించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పులు, అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. వీడియోలో, వాహనం నంబర్ ప్లేట్, దుకాణం నేమ్ బోర్డులో పదాలు డిస్టార్టెడ్ (గజిబిజిగా) ఉండడం, ఆవు స్కూటర్‌పై వెళ్లేటప్పుడు దాని శరీరంపై ఉన్న మచ్చలు రంగు మారడం, మొదట కనిపించిన కొమ్ముల తర్వాత మాయం అవ్వడం మనం గమనించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.
తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 95.5% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.
మే 2025లో, రిషికేశ్‌లో ఒక ఆవు రోడ్డుపై స్కూటర్ నడుపుతున్నట్లు చూపించే ఒక వీడియో వైరల్ అయింది, కానీ CCTV ఫుటేజ్‌లో ఆవు బరువు కారణంగా స్కూటర్ ముందుకు కదులుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు ఆ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదు.
చివరిగా, రోడ్డుపై ఒక ఆవు స్కూటర్ నడుపుతున్న దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు.