‘‘కేంద్ర ప్రభుత్వ అనుమతితో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయ దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఇది’’ అంటూ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే, ఇదే వీడియోను షేర్ చేస్తూ ‘‘ఈ వీడియోను నిజంగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించిందా? లేదా? అని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వ అనుమతితో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయ దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించలేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు2017లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధీనంలో పనిచేసే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC-TTD) విడుదల చేసిన ఓ వీడియో నుంచి తీసుకున్నవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న వీడియోను SVBC TTD అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో 02 జూన్ 2017న షేర్ చేసినట్లు కనుగొన్నాము. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ – తిరుమల తిరుపతి దేవస్థానం (SVBC-TTD) అనే ఈ భక్తి ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహించబడుతుందని మాకు తెలిసింది.
నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ‘ఇన్‌సైడ్ తిరుమల తిరుపతి’ పేరుతో తిరుమల ఆలయంపై ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీలో ఆలయం యొక్క రోజువారీ కార్యకలాపాలు, బ్రహ్మోత్సవాలను చూపించారు. దీనిని దాదాపు ఒక సంవత్సరం పాటు చిత్రీకరించారు. అయితే, ఈ డాక్యుమెంటరీలో గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని చూపించలేదు. ఆ దృశ్యాల కోసం గర్భగుడిని పోలిన నమూనా ఆలయాన్ని నిర్మించి అందులో చిత్రీకరించారు.
చివరిగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంపై నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించినవి కావు.