ఆంధ్ర ప్రదేశ్‌లో Avian Influenza (బర్డ్ ఫ్లూ) వ్యాధి కలకలం రేపుతుంది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో ఈ వ్యాధి సోకిందని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ). బర్డ్ ఫ్లూ విస్తరణ తగ్గించడానికి ప్రభుత్వం పలు చోట్ల కంటైన్మెంట్ జోన్లను (బయో సెక్యూరిటీ జోన్లు) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ‘New వైరస్ బర్డ్ ఫ్లూ’ అనే క్యాప్షన్‌తో ఒక కోడి తన నోట్లో నుంచి నిప్పులు కక్కుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నేలపై ఉన్న ఒక కోడిపిల్ల పొట్టని ఒక వ్యక్తి నొక్కుతుండగా, కోడి నోట్లోనుంచి నిప్పు రావడం మనం గమనించవచ్చు. అసలు, ఈ వీడియో వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి, తన నోట్లో నుంచి నిప్పులు కక్కుతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది డిసెంబర్ 2024 నాటి వీడియో. ఈ సంఘటన కర్ణాటకలోని హడిగే అనే గ్రామంలో జరిగింది. బర్డ్ ఫ్లూ వల్ల ఈ కోడికి ఇలా జరిగింది అని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. ఈ వీడియోకి, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కేసులకు సంబంధం లేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో గురించి డిసెంబర్ 2024లో వచ్చిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. వీటి ప్రకారం ఈ సంఘటన కర్ణాటకలోని సక్లెష్‌పురా దగ్గర ఉన్న హడిగే గ్రామంలో జరిగింది.

19 డిసెంబర్ 2024న ‘ఉదయ వాణి లో వచ్చిన ఒక వార్తా కథనం ప్రకారం 18 డిసెంబర్ 2024న హడిగే గ్రామంలో రవి అనే వ్యక్తికి చెందిన 12 కోళ్లు మరణించాయి. అయితే, ఈ వార్తా కథనాల్లో ఈ కోడి ఎందుకు అలా నిప్పులు కక్కింది అనే కారణాలు వెల్లడించలేదు. వార్తా కథనాల (ఇక్కడ, ఇక్కడ) ప్రకారం ఈ కోళ్లకి ఎవరైనా విషం ఇచ్చి ఇలా చంపి ఉంటారా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

దీని బట్టి ఈ వీడియో ప్రస్తుత బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించింది కాదు అని మనకు స్పష్టం అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వారి 11 ఫిబ్రవరి 2025 నాటి వార్తా కథనం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లోని గోదావరి ప్రాంతలో 13 జనవరి 2025 నుంచి కోళ్లు మరణించడం మొదలైంది.

అదనంగా, Avian Influenza (బర్డ్ ఫ్లూ) వ్యాధి సోకిన పక్షుల నోట్లో నుంచి నిప్పులు కక్కుతాయి అని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వ్యాధి వచ్చిన పక్షులలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, కోడి నోటిలో నుండి నిప్పులు వస్తున్న ఈ వీడియో డిసెంబర్ 2024లో కర్ణాటకలో జరిగిన సంఘటనకి చెందినది, 2025 ఆంధ్ర ప్రదేశ్ బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించింది కాదు.