ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి చేస్తున్న నేపథ్యంలో ఒక చిన్న పిల్లాడు గడ్డి తింటున్న వీడియోని షేర్ చేస్తూ, యుద్ధం కారణంగా ఆహారం లేక ఉక్రెయిన్లోని చిన్న పిల్లలు గడ్డి తింటున్నారని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: యుద్ధం కారణంగా ఆహారం లేక ఉక్రెయిన్లోని చిన్న పిల్లాడు గడ్డి తింటున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో రష్యా ఉక్రెయిన్పై దాడి ప్రారంభించాక ముందు నుండే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. సిరియాలో ఆహారం లేక ఆకలికి పిల్లలు గడ్డి తింటున్నారంటూ ఇదే వీడియో సోషల్ మీడియాలో ముందు నుండి షేర్ అవుతూ ఉంది. తినడానికి ఆహారం దొరకక సిరియాలో చిన్నపిల్లలు ఆకలికి గడ్డి తిన్నట్టు గతంలో పలు వార్తా కథనాలు కూడా రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం ఉక్రెయిన్పై కొనసాగుతున్న సైనిక దాడికి సంబంధించి, ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా తమ సైన్యాన్ని మరియు యుద్ద ట్యాంక్లను మొహరిస్తూ, హెచ్చరికలు జారీ చేసిన అనంతరం 24 ఫిబ్రవరి 2022 తెల్లవారుజామున ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించింది.
ఐతే పోస్టులో షేర్ చేసిన చిన్న పిల్లాడు గడ్డి తింటున్న వీడియో, ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభం కాకముందు నుండే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. దాడికి ఒక్కరోజు ముందు సిరియాలో ఆహారం లేక ఆకలికి పిల్లలు గడ్డి తింటున్నారంటూ ఇదే వీడియోని సోషల్ మీడియా మరియు యూట్యూబ్లో షేర్ చేసిన పోస్టులు మాకు లభించాయి. వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
తినడానికి ఆహారం దొరకక సిరియాలో చిన్నపిల్లలు ఆకలికి గడ్డి తిన్నట్టు గతంలో పలు కథనాలు కూడా ప్రసారమయ్యాయి. వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే ఈ వీడియో ఎక్కడిదో, ఈ వీడియోలోని దృశ్యాల నేపథ్యం ఏంటో మాకు తెలియనప్పటికీ ఈ వీడియో ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ వీడియోతో ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధంలేదని చెప్పొచ్చు.
పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా చిన్న పిల్లాడు గడ్డి తింటున్న ఈ దృశ్యాలను ఉక్రెయిన్లో నెలకొన్న ప్రస్తుత పరిస్తితులంటూ కథనాలు (ఇక్కడ) ప్రసారం చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
చివరగా, చిన్న పిల్లాడు గడ్డి తింటున్న వీడియోకి ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధంలేదు.