‘శివలింగం ముందు భక్తితో మోకరిల్లిన గోమాత’ నిజమైన దృశ్యాలని చెప్తూ AI ఉపయోగించి తయారు చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

శివలింగం ముందు భక్తితో మోకరిల్లిన గోమాత’ అని చెప్తూ, ఒక ఆవు ఒక గుడి లాంటి ప్రదేశంలో ఒక శివలింగం ముందు మోకాళ్ళ పైన నిలుచున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఒక ఆవు భక్తితో శివలింగం ముందు మోకరిల్లిన నిజమైన సంఘటన యొక్క వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించిన ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు మాకు దొరకలేదు. వైరల్ వీడియోని మేము సరిగ్గా పరిశీలించగా, అందులో కనిపిస్తున్న మనుషులు, వీడియోలో చాలా భాగం వరకు ఒకే చోట ఎలాంటి చలనం లేకుండా ఉండటం మేము గమనించాము. అలాగే, వీడియోలో ఉన్న కొన్ని దీపాలు, కొన్ని చోట్ల అస్సలు చలనం లేకుండా ఉండటం లాంటి అవకతవకలను కూడా మేము గమనించాము.

నిజజీవితంలో తీసిన వీడియోలలో దీపాల్లో ఉన్న జ్యోతి, కొంత అయినా గాలికి అటు ఇటు ఆడటం మనం చూస్తూ ఉంటాము, కానీ ఇందులో కొన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నాయి. సహజంగా ఇటువంటి తప్పిదాలు/అవకతవకలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలు, ఇమేజ్‌లలో కనిపిస్తూ ఉంటాయి. 

ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఇదే వీడియో మాకు లక్ష్మణ్ జైస్వాల్ అనే టిక్ టాక్ యూజర్ పేజీలో లభించింది. ఈ వీడియోను లక్ష్మణ్ 29 అక్టోబర్ 2025న పోస్ట్ చేశాడు. 

అయితే ఈ పోస్టులో ఈ వీడియో AI ఉపయోగించి తయారు చేసినదని చెప్తూ ‘Creator labelled as AI-generated’ అనే ట్యాగ్ మాకు కనిపించింది. ఈ కంటెంట్ అప్లోడ్ చేసిన వారు, ఈ వీడియో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసినది అని చెప్పారని దీని అర్థం. అలాగే, ఈ లక్ష్మణ్ జైస్వాల్ టిక్ టాక్ పేజీలో ఇటువంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలో మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి Hive అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చూడగా, ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసింది అని అది స్పష్టం చేసింది.

చివరగా, ‘శివలింగం ముందు భక్తితో మోకరిల్లిన గోమాత’ నిజమైన దృశ్యాలని చెప్తూ AI ఉపయోగించి తయారు చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు