అభ్యంతరకరమైన పదాలతో ఉన్న ఈ గణిత ప్రశ్న పశ్చిమ బెంగాల్ పాఠ్యపుస్తకంలోనిది కాదు

పశ్చిమబెంగాల్ మూడో తరగతి పాఠ్యపుస్తకానికి చెందిన గణిత ప్రశ్న అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. “ఒక ముజాహిద్‌ మొదటి రోజు 24 మందిని, రెండవ రోజు 18 మందిని, మూడవ రోజు 12 మంది శత్రువులను చంపాడు. మొత్తం మీద అతను ఎంతమంది శత్రువులను చంపాడు?” అని ఈ ప్రశ్న సారాంశం. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ మూడవ తరగతి పాఠ్యపుస్తకంలో అభ్యంతరకరమైన భాషతో ఉన్న గణిత ప్రశ్న

ఫాక్ట్: పోస్టులో ఉన్న గణిత ప్రశ్న ‘ఐడియల్ ముస్లిం మ్యాథమాటిక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ 1” పుస్తకంలోనిది. ఈ పుస్తకం ఢాకాలోని ఖవ్మీ మదర్సా పబ్లికేషన్స్ చే ప్రచురించబడింది మరియు ఇది బంగ్లాదేశ్లోని ఒకటో తరగతి మదర్సా విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. పశ్చిమ బెంగాల్ మూడవ తరగతి గణిత పాఠ్యపుస్తకం ‘అమర్ గనిత్’ లో వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు అలాంటి పదాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, పశ్చిమబెంగాల్ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్లో మూడో తరగతి గణితం పాఠ్యపుస్తకం కోసం వెతికాము. ఈ పుస్తకం పేరు ‘అమర్ గనిత్’. అయితే, మొదటి నుండి చివరి వరకు పుస్తకాన్ని పూర్తిగా పరీక్షించగా, వైరల్ పోస్టులో ఉన్న ప్రశ్న ఈ పుస్తకంలోనిది కాదని తెలిసింది.

ఇక, సంబంధిత పదాలతో ఇంటర్నెట్లో వెతకగా ఇదే ఫొటోను 10 ఏప్రిల్ 2020 నాడు బాబు మృదా అనే వ్యక్తి ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించాము. అయితే, అతను ఆ పుస్తకంలో వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని చెప్తూ పుస్తకం పేరు ‘Ideal Muslim Math Education class I’ అని పేర్కొన్నాడు. మరియు దాని కవర్ ఇమేజ్‌ను కూడా పోస్ట్ చేశారు.

దీని ఆధారంగా ఈ పుస్తకం గురించి మరింత వెతకగా, ఇది బంగ్లాదేశ్‌లోని మదర్సాలకు సంబంధించినదని తెలిసింది. పలు బంగ్లాదేశీ ఈ-కామర్స్ సైట్లలో అమ్ముడవుతున్న ఈ పుస్తకాన్ని ‘ఖవ్మీ మదర్సా పబ్లికేషన్స్- ఢాకా’ వారు ప్రచురించినట్లు పుస్తకం పైన చూడవచ్చు.

అంతేకాక, వైరల్ చిత్రంలో పేజీ పై భాగంలో ఉన్న పదాలు ఈ పుస్తకం పేరుని సూచిస్తున్నాయి.

చివరిగా,పై ఆధారాలతో వైరల్ అవుతున్న పోస్టులోని గణిత ప్రశ్న పశ్చిమ బెంగాల్ పాఠ్యపుస్తకంలోనిది కాదని నిర్ధారించవచ్చు.