ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై దాసరి ఉష విమర్శలు చేసిందంటూ షేర్ చేస్తున్న ఈ న్యూస్ క్లిప్ ఫేక్

మాజీ ఐపీఎస్, ప్రస్తుత BRS నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై అదే పార్టీకి చెందిన నేత  దాసరి ఉష విమర్శలు చేసినట్టు ‘నా తెలంగాణ’ పేరుతో ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ప్రవీణ్ కుమార్‌ ‘బీఎస్పీ టిక్కెట్లు అమ్ముకున్నాడని, అసెంబ్లీ ఎన్నికల కోసం తన దగ్గర 20 కోట్లు తీసుకున్నాడని’, ఇంకా పలు ఆరోపణలు దాసరి ఉష చేసినట్టు ఈ న్యూస్ క్లిప్ రిపోర్ట్ చేసింది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద మోసగాడు : దాసరి ఉషా – ‘నా తెలంగాణ’ న్యూస్ క్లిప్

ఫాక్ట్(నిజం): ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి దాసరి ఉష ఇలాంటి విమర్శలేవీ చేయలేదు. ‘నా తెలంగాణ’ పత్రిక కూడా ఇలాంటి వార్త ఏది ప్రచురించలేదు. ప్రస్తుతం షేర్ చేస్తున్నది ఫేక్ న్యూస్ క్లిప్. దాసరి ఉష కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై ఆ పార్టీకి చెందిన దాసరి ఉష విమర్శలు చేసిందన్న వార్తలో నిజం లేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న క్లిప్ డిజిటల్‌గా రూపొందించింది. ముందుగా ఉష ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మీడియా దీన్ని రిపోర్ట్ చేసిన ఉండేది, కానీ మాకు అలంటి రిపోర్ట్స్ ఏవి దొరకలేదు.

ఈ వార్తకు సంబంధించిన సమాచారం కోసం వెతకగా ఈ క్లిప్‌పై దాసరి ఉష వివరణ ఇచ్చిన ట్విట్టర్ పోస్టు మాకు కనిపించింది. ఈ వార్త ఫేక్ అని, ఎవరు ఈ వార్తను నమ్మవద్దని ఆమె ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్ లో అందించిన వెబ్ లింక్ ఆధారంగా వెతకగా ఇది 02 మే 2024 నాడు దిశ పత్రిక ప్రచురించిన ఒక వార్తకు సంబంధించిందని తెలిసింది. ఇది పీ.ఎం.పీ, ఆర్.ఎం.పీల క్లినిక్లపై రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు నిర్వహిస్తున్న దాడులకు సంబంధించిన వార్త.

కాగా ‘నా తెలంగాణ’ వెబ్సైట్‌లో ఇలా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మరియు ఉషకు సంబంధించి మాకు ఎలాంటి వార్త కనిపించలేదు. 06 మే 2024 నాడు ‘నా తెలంగాణ’ ఇలాంటి వార్త ఏది ప్రచురించలేదు. దీన్నిబట్టి ప్రస్తుతం షేర్ చేస్తున్న ఫేక్  క్లిప్‌ను డిజిటల్‌గా రూపొందించినట్టు అర్ధమవుతుంది.

చివరగా, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై దాసరి ఉష విమర్శలు చేసిందంటూ షేర్ చేస్తున్న ఈ న్యూస్ క్లిప్ ఫేక్.