Fake News, Telugu
 

పోలీస్ సిబ్బంది బురద నీటిలో చేతులు కడుక్కుంటున్న ఈ ఘటన ఇటీవల మోదీ పాల్గొన్న భీమవరం సభలో జరిగింది

0

ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిన నేపథ్యంలో, సభలో బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్తితి అంటూ ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. టీఎస్ పోలీస్ అనే హాష్ ట్యాగ్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో పోలీస్ సిబ్బంది బురద నీళ్ళల్లో చేతులు కడుక్కోవడం చూడొచ్చు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ సభలో బందోబస్తుకు వచ్చిన తెలంగాణ పోలీస్ సిబ్బంది మంచినీళ్ళు లేక బురద నీటిలో చేతులు కడుగుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ దృశ్యాలు ఇటీవల 04 జూలై 2022న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు సంబంధించినవి. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించలేదని, పోలీసులు బురద నీటిలో చేతులు కడుకున్నట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఈ దృశ్యాలకు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సభకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల జూలై 02 మరియు 03వ తారీకున హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి మోదీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశాల చివరి రోజున హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఒక సభ కూడా జరిగింది.

ఐతే వైరల్ అవుతున్న వీడియోకు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి గానీ, తరువాత జరిగిన సభకు గానీ ఎటువంటి సంబంధంలేదు. అసలు ఈ వీడియోలో బురద నీటిలో చేతులు కడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు కాదు. వీడియోలో పోలీసుల యూనిఫారంపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ లోగో చూడొచ్చు.

వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం యూట్యూబ్‌లో వెతకగా, ఈ దృశ్యాలు ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలకు సంబంధించినవని రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది.

125వ జయంతి వేడుకల్లో భాగంగా 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు. ఐతే ఈ సభలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి  కనీస సౌకర్యాలు కల్పించలేదని ఈ రిపోర్ట్ పేర్కొంది. చేతులు కడుక్కోవడానికి నీళ్ళు లేకపోవడంతో వర్షం నీటిలోనే పోలీసులు చేతులు కడుకున్నట్టు ఈ కథనం రిపోర్ట్ చేసింది.

దీన్నిబట్టి, ఈ దృశ్యాలకు తెలంగాణలో జరిగిన బీజేపీ సభకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది. పైగా హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సభలో ఇలాంటి ఘటనలు జరిగినట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

చివరగా, పోలీస్ సిబ్బంది బురద నీటిలో చేతులు కడుకుంటున్న ఈ ఘటన ఇటీవల మోదీ పాల్గొన్న భీమవరం సభలో జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll