2014లోని నిత్యావసర వస్తువుల ధరలకి ఈ పోస్టులో చెప్తున్న ధరలకి చాలా వ్యత్యాసం ఉంది.

YouTube Poster

2014లోని నిత్యావసర వస్తువుల ధరలను 2021లోని ధరలతో పోల్చుతూ, 2021లో నిత్యావసర వస్తువుల ధరలు 2014లో కన్నా చాలా తక్కువని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2014తో పోలిస్తే 2021లో నిత్యావసరాల ధరలు చాలా తక్కువ.

ఫాక్ట్(నిజం): డిపార్టుమెంటు అఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వెబ్సైటులో ఉన్న 2014 నిత్యావసర వస్తువుల ధరలకి, పోస్టులో చెప్తున్న ధరలకి చాలా వ్యత్యాసం ఉంది. 2014లో నిత్యావసర వస్తువుల ధరలు పోస్టులో చెప్తున్నంత ఎక్కువగా లేవు. ఉదాహరణకి 2014లో కిలో మూంగ్ దాల్ ధర రూ. 97.26 పైసలు కాగా పోస్టులో మాత్రం కిలో మూంగ్ దాల్ ధర రూ. 180 అని పేర్కొన్నారు. అలాగే పోస్టులో 2014లో కిలో ఉరద్ దాల్ ధర రూ. 178 అని చెప్తున్నారు కాని నిజానికి 2014లో కిలో ఉరద్ దళ్ ధర రూ.79 మాత్రమే. 2014తో పోల్చుకుంటే 2021లో నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి బట్టి పోస్టులో 2014లోని నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ చేసి చూపించారని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మరియు  నిత్యావసరాల వస్తువుల ధరలు నియంత్రణలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా డిపార్టుమెంటు అఫ్ కన్స్యూమర్ అఫైర్స్ లోని ప్రైస్ మోనిటరింగ్ డివిజన్ (PMD) దేశంలోని 115 మార్కెట్ సెంటర్లలో బియ్యం,చెక్కర, నూనే, పలు రకాల పప్పులు మొదలైన 22 నిత్యావసరాల వస్తువుల రోజువారి రిటైల్ మరియు హోల్ సేల్ ధరలను మానిటర్ చేస్తుంది. ఐతే ఈ వెబ్సైటులో 2013 నుండి 2021 వరకు ప్రతీ నెల చివరి ధరలను సేకరించి వాటి  సగటును లెక్కించాము, ఈ సమాచారం కింది టేబుల్ లో చూడొచ్చు.

పోస్టులో చెప్తున్న 2021లోని నిత్యావసర వస్తువుల ధరలకి ఈ వెబ్సైటులో ఉన్న ధరలకి పెద్దగా వ్యత్యాసం లేకపోయినా, పోస్టులో చెప్తున్న 2014 ధరలకి వెబ్సైటులోని 2014 అసలు ధరలకి చాలా వ్యత్యాసం గమనించొచ్చు. ఈ వెబ్సైటులోని సమాచారం ప్రకారం 2014లో కిలో మూంగ్ దాల్ ధర రూ. 97.26 పైసలు కాగా పోస్టులో మాత్రం కిలో మూంగ్ దాల్ ధర రూ.180 అని పేర్కొన్నారు. అలాగే పోస్టులో 2014లో కిలో ఉరద్ దాల్ ధర రూ. 178 అని చెప్తున్నారు కాని నిజానికి 2014లో కిలో ఉరద్ దళ్ ధర రూ.79 మాత్రమే. అదే విధంగా పోస్టులో 2014లో కిలో తుర్ దాల్ ధర రూ.210 అని చెప్తున్నారు కాని నిజానికి ఈ ధర రూ.75.83 మాత్రమే. అలాగే మిగతా వస్తువుల ధరల కూడా ఎక్కువ చేసి చూపించారు. పోస్టులో చెప్తున్న 2014 & 2021 ధరలకు, కేంద్ర మంత్రిత్వ శాఖ వెబ్సైటులోని అసలు ధరలకు మధ్య వ్యత్యాసం కింది టేబుల్ లో చూడొచ్చు. వీటన్నిటి బట్టి పోస్టులో 2014లోని నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ చేసి చెప్పారని కచ్చితంగా చెప్పొచ్చు.

సాధారణంగా ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. పోస్టులో ప్రస్తావించిన  నిత్యావసర వస్తువులలో కేవలం ఉరద్ దాల్ మరియు తూర్ దాల్ ధర మాత్రమే 2014తో పోల్చుకుంటే 2021లో గణనీయంగా పెరిగాయి, మిగతా నిత్యావసర వస్తువుల ధరలు 2014తో పోల్చుకుంటే 2021లో ఎక్కువగా ఏమీ పెరగలేదు. ఉదాహరణకి 2014లో కిలో ఉరద్ దాల్ రూ.79గా ఉండగా అది 2021లో రూ. 109 అయింది. అదే విధంగా 2014లో కిలో తూర్ దాల్ రూ.75.83గా ఉండగా అది 2021లో రూ. 104 అయింది. దీన్నిబట్టి 2014తో పోల్చుకుంటే 2021లోనే నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉన్నాయని అర్ధమవుతుంది.

చివరగా, 2014లోని నిత్యావసర ధరలకి ఈ పోస్టులో చెప్తున్న ధరలకి చాలా వ్యత్యాసం ఉంది.