అప్డేట్ (15 మార్చి 2022):
అదే పాత వీడియోని మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వీడియోగా చెప్తున్నారు. తాజగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (2022) బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. అయితే, ఆ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదు. అంతేకాదు, అది ఒక పాత వీడియో. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.
అప్డేట్ (అక్టోబర్ 11, 2019):
కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని కొడ్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి ‘బీహార్ లో జై శ్రీ రాం పేరుతో #ఉన్మాదం, #మతోన్మాదం, #తీవ్రవాదం #ఉగ్రవాదం #పోలీసులు కూడా ఏమీ చేయలేని దుస్థితి…’ అని పోస్టు చేస్తున్నారు. ఆ ఆరోపణలో ఎంత వాస్తవం ఉందో కనుక్కుందాం.
క్లెయిమ్: బీహార్ లో జై శ్రీ రాం పేరుతో ఉన్మాదం.
ఫాక్ట్ (నిజం): బీహార్ లోని బబువ టౌన్ లో ‘భూ వివాదం’ కి సంబంధించి జరిగిన ఘర్షణ వీడియో అది. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.
పోస్టులో పెట్టిన వీడియోలో కొంతమంది వ్యక్తులు ఒకతన్ని కొడుతుంటే అక్కడున్న జనం జై శ్రీ రామ్ అని అంటారు. దానికి సంబంధించిన సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ‘India Today’ ఆర్టికల్ లభించింది. దాని ద్వారా, పరస్పర శత్రుత్వంతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కాల్చి, అక్కడి నుండి పరిగెత్తడానికి ప్రయత్నించినప్పుడు చుట్టు ప్రక్కలున్న జనం అతన్ని కొట్టినట్లుగా తెలిసింది. అదే విషయాన్ని వెల్లడిస్తూ ‘Prabhat Khabar’ వార్తా సంస్థ వారు కూడా కథనాన్ని ప్రచురించారు. అందులో, బబువ అనే ప్రాంతంలో ఒక వార్డ్ కౌన్సిలర్ కొడుకు తుపాకీతో మాధవ్ సింహ్ అనే వ్యక్తిని కాల్చి, తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అక్కడున్న జనం అతన్ని కొట్టారని ఉంది.
మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, తుపాకీతో కాల్చిన వ్యక్తి పేరు సాహిల్ రాయిన్ అనీ, ఆ ఘటనకి సంబంధించి అతనిపై మాధవ్ సింహ్ పిన్ని అయిన ఇంద్రావసి దేవి బబువ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లుగా తెలిసింది. ఆ FIR కాపీ చూసినప్పుడు, దేవ్ శరన్ సింహ్ అనే వ్యక్తి మాధవ్ సింహ్ భూమిని ఆక్రమించాడని, దానికి సంబంధించి కోర్ట్ లో విచారణ జరుగుతోందని, ఆ భూవివాదంలోనే సాహిల్ రాయిన్ అనే వ్యక్తి మాధవ్ ని తుపాకీతో కాల్చినట్లుగా ఉంది. అంతేకాదు, రాయిన్ కాల్చిన అనంతరం అక్కడి నుండి పరిగెత్తి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ప్రక్కన ఉన్న జనం అతన్ని పట్టుకుని కొట్టారు అని ఉంది.
అదే ఘటనకి సంబంధించి బబువ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా ఒక FIR ఫైల్ చేశారు. అందులో పరస్పర శత్రుత్వంతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కాల్చిన అనంతరం అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఉన్న జనం అతన్ని కొట్టినట్లుగా ఉంది.
పైన ఉన్న వార్తా పత్రికల కథనాలలో గానీ, ఆ రెండు FIR కాపీలలో గానీ ఆ వీడియోలోని ఘటన మతపరమైనదని ఎక్కడా పేర్కోలేదని చూడవచ్చు. అంతేకాదు, అది ఒక భూ వివాదానికి సంబంధించిన ఘటన, మతపరమైన అంశంతో దానికి సంబంధం లేదు.
అంతేకాదు, గాయపడిన రాయిన్ చనిపోయాడంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కైముర్ (బబువ) ఎస్.పీ. కి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, రాయిన్ బ్రతికే ఉన్నాడని, అతన్ని జైలులో పెట్టారని చెప్పాడు.
చివరగా, బీహార్ లో ‘భూ వివాదం’ లో జరిగిన ఘర్షణ కి సంబంధించిన వీడియో ని ‘మత వివాద’ సంఘటనకి సంబంధించిదన వీడియోగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?