వివరణ (29 January 2025): ఈ ఆర్టికల్ తిరువనంతపురం పోలీస్ కమిషనర్ థామ్సన్ జోస్ మరియు కేరళ సైబర్ క్రైమ్ పోలీసుల స్పందనలతో అప్డేట్ చేయటం జరిగింది.
“తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్ థామస్ కుప్పకూలి చనిపోయారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, ఒక పోలీసు అధికారి అకస్మాత్తుగా కుప్పకూలిపోవడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ థామస్ గణతంత్ర దినోత్సవం వేడుకలలో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): తిరువనంతపురం నగర పోలీసు కమిషనర్ థామ్సన్ జోస్ చనిపోలేదు. ఆయన క్షేమంగానే ఉన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరి 2025న కేరళలోని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా తిరువనంతపురం సీపీ థామ్సన్ జోస్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే అతని సహచరులు, పోలీసు సిబ్బంది అతనికి ప్రథమ చికిత్స అందించారు. థామ్సన్ జోస్ ప్రాథమిక చికిత్స తర్వాత తిరిగి వచ్చి యథావిధిగా తన విధులను కొనసాగించాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ పోస్టులో పేర్కొనట్లుగా తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ థామస్ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ కేరళ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలను మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరి 2025న కేరళలోని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా తిరువనంతపురం సీపీ థామ్సన్ జోస్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఈ కథనాల ప్రకారం, పోలీస్ కమిషనర్ థామ్సన్ జోస్ వడదెబ్బ కారణంగా కుప్పకూలిపోయారు, థామ్సన్ జోస్ ప్రాథమిక చికిత్స తర్వాత తిరిగి వచ్చి యథావిధిగా తన విధులను కొనసాగించాడని తెలుస్తుంది.
ఈ సంఘటన గురుంచి మరిన్ని వివరాల కోసం కేరళ పోలీసు శాఖను సంప్రదించాము. తిరువనంతపురం పోలీస్ కమిషనర్ థామ్సన్ జోస్ స్వయంగా వాట్సాప్‌లో స్పందిస్తూ, “ఆయన క్షేమంగా మరియు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, విధులకు కూడా హాజరవుతున్నానని. అలాగే, 26 జనవరి 2025న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పృహ కోల్పోయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చి వేడుకల్లో పాల్గొన్నాను” అని స్పష్టంచేశారు.
ఈ ఘటన గురించి మేము కేరళ సైబర్ క్రైమ్ పోలీసుల సంప్రదించగా, వారు ఈమెయిల్ ద్వారా స్పందిస్తూ, “వైరల్ వీడియో తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పృహ కోల్పోయి కింద పడిపోవడాన్ని చూపిస్తుంది, ఆయన స్పృహ కోల్పోయిన 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి వేడుకలో పాల్గొన్నారు. ఆయన ప్రస్తుతం పూర్తిగా క్షేమంగా ఉన్నారు.” అని పేర్కొన్నారు .
చివరగా, తిరువనంతపురం నగర పోలీసు కమిషనర్ థామ్సన్ జోస్ చనిపోలేదు. ఆయన 26 జనవరి 2025న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేవలం కళ్ళు తిరిగి పడిపోయారు.