ఈ వీడియో కేరళలోని ‘మాపిల తెయ్యం’ ఆచారానికి చెందినది; ఇందులో అజాన్ చదవడం ఒక భాగం

కేరళ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో ముస్లిం మరియు క్రైస్తవ పూజారులను నియమించడం వల్ల వారు హనుమంతుడి చిత్రపటానికి మాంసం వడ్డించి, మద్యం త్రాగించి అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తున్నారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కేరళ ప్రభుత్వం దేవాలయాల్లో ముస్లిం, క్రైస్తవ పూజారులను నియమించడం కారణంగా వారు హనుమంతుని చిత్రపటానికి మద్యం, మాంసం పెట్టి అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తున్నారు.

ఫాక్ట్: వైరల్ వీడియో ఉత్తర కేరళలో నిర్వహించే ‘మాపిల తెయ్యం’ అనే ఆచారాన్ని చూపుతుంది. ఈ ఉత్సవాల్లో, హిందూ వ్యక్తులు (దైవ నర్తకులు) ముస్లింల వేషధారణలో అజాన్ చదువుతారు. అలాగే, కొన్ని తెయ్యాలలో మద్యం మరియు మాంసం సమర్పిస్తారు. కేరళ ప్రభుత్వం హిందూ దేవాలయాలలో పూజారులుగా ముస్లింలు/క్రైస్తవులను నియమిస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో శ్రీ కొమరాయ దైవ ఆస్థానంలో 2022లో జరిగినట్లు పలు వార్త కథనాల (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ద్వారా తెలిసింది.

వీటి ప్రకారం, ఉత్తర కేరళ మరియు దక్షిణ కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో తెయ్యం (దైవం) అనే ఒక హిందూ మతానికి చెందిన ఆచారాన్ని జరుపుకుంటారు. దైవ వేషధారణ వేసుకున్న మనిషిని దేవుడిగా లేదా దేవ దూతగా భావించి భక్తులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తెయ్యంలో అనేక వందల రకాలు ఉన్నాయి. తెయ్యం సాధారణంగా పులయర్, వన్నన్, మలయన్, అన్హూట్టన్, మున్నూట్టన్, మావిలన్, కొప్పలన్, వేలన్, చింగతన్, కళనాడి, పరవన్, నళికేయవర్ వంటి కులాలు మరియు తెగల ప్రజలు ప్రదర్శిస్తారు.

అయితే, వీటిలో ‘మాపిల తెయ్యం’ అనే ఒక రకమైన తెయ్యం ఆచారాల్లో హిందువులు ముస్లిం వేషధారణ వేసుకుకొని ఇస్లాం మతానికి చెందిన కథలు, నినాదాలు ఇస్తారు. హిందూ- ముస్లిం ఐక్యతకు సూచించే విధంగా వీటిని నిర్వహిస్తారు. ‘మాపిల తెయ్యం’ లో పదిహేనుకు పైగా రకాలు ఉన్నాయి. వైరల్ వీడియోలో ప్రదర్శించేది బపిరియన్ తెయ్యం. ఇందులో భాగంగా ముస్లిం వేషధారణ వేసుకున్న వ్యక్తి అజాన్ చదువుతాడు. అనేక ఏళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొన్ని రకాల తెయ్యం ఆచారాల్లో మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పిస్తారు అని పలు వార్తా కథనాల్లో పేర్కొన్నారు.

కేరళ ప్రభుత్వం దేవాలయాల్లో ముస్లింలు, క్రైస్తవులను అర్చకులుగా నియమించిందా?

కేరళలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆలయ బోర్డులు, ప్రైవేట్ ఆలయ బోర్డులు లేదా నాయర్ సర్వీస్ సొసైటీ (NSS) మరియు శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (SNDP) యోగం, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వంటి కమ్యూనిటీ సంస్థలచే నిర్వహించబడే దేవాలయాలు ఉన్నాయి.

అర్చకులతో సహా సిబ్బందిని సంబంధిత ఆలయ బోర్డులు నియమిస్తాయి. సాంప్రదాయకంగా కుటుంబ సభ్యునికి ఇవ్వబడిన పోస్టులు మినహా, బోర్డుల పరిధిలోని దేవాలయాలకు నియామకం హిందూ మత సంస్థల చట్టం,1951 ప్రకారం జరుగుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, నియామకాల్లో ఎస్సీలకు 10%, ఎస్టీలకు 2% రిజర్వేషన్లు లభిస్తాయి.

2017లో ట్రావెన్‌కోర్ బోర్డు తొలిసారిగా దళితులను వివిధ దేవాలయాల్లో పూజారులుగా నియమించినట్లు కథనాలు వచ్చాయి. కానీ, కేరళ ప్రభుత్వం దేవాలయాల్లో ముస్లిం మరియు క్రైస్తవ పూజారులను నియమించిందా అని వెతకగా మాకు ఎటువంటి అధికారిక సమాచారం/వార్తా కథనాలు లభించలేదు.

చివరిగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు కేరళలోని మాపిల తెయ్యం అనే ఆచారానికి సంబంధించివి. ఇందులో అజాన్ చదవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.