అమెరికాలో(U.S) అక్రమంగా నివసిస్తున్న వలసదారులను ఆ దేశం తరలించి వేస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక వీడియో(ఇక్కడ , ఇక్కడ) వైరల్ అవుతోంది. అక్కడ అక్రమంగా నివసిస్తున్న భారతీయులను C-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలిస్తున్న వీడియో అని చెప్తూ దీన్ని షేర్ చేస్తున్నారు. ఈ వీడియోతో పాటు భారతీయులని అమెరికా నుంచి తరలిస్తున్న వీడియోలు అని చెప్పి మరి కొన్ని ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కూడా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: అమెరికాలో(U.S) అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారులని C-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలిస్తున్న వీడియో, ఫోటోలు.
ఫ్యాక్ట్(నిజం): వైరల్ వీడియో భారత వలసదారులను అమెరికా నుంచి తరలివేస్తున్న సంఘటనకు సంబంధించింది కాదు. భారత వలసదారులు ఉన్న అమెరికా మిలటరీ విమానం 4 ఫిబ్రవరి 2025న అమెరికా నుండి బయలుదేరి 5వ తారీఖున అమృత్సర్ నగరంలో ల్యాండ్ అయ్యింది. వైరల్ వీడియో 23 జనవరి 2025న తీసింది. అలాగే మిగిలిన ఫోటోలు కూడా భారతీయులకు సంబందించినవి కావు. కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.
వైరల్ అవుతున్న వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా వైరల్ వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు U.S డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ (DoD) యొక్క డిఫెన్స్ విజువల్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్(DVIDS) వెబ్సైటులో లభించింది.
ఈ వీడియో వివరణలో దీన్ని 23 జనవరి 2025న అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్ బ్లెస్ అనే ప్రదేశంలో తీశారు అని ఉంది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని C-17 Globemaster III ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలిస్తున్న దృశ్యాలు ఇవి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క మొదటి ‘removal flight’ అని ఈ వీడియో యొక్క హెడ్‌లైన్‌లో పేర్కొన్నారు.
కానీ వీడియో వివరణలో వీరు ఏ దేశస్తులు అనే విషయం మాత్రం చెప్పలేదు. ఇదే వీడియోని పలు మీడియా సంస్థలు కూడా పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ) చేస్తూ ఇది 23 జనవరి 2025న తీసిన వీడియో అని పేర్కొన్నారు. వార్తా కథనాల (ఇక్కడ, ఇక్కడ) ప్రకారం ఈ మొదట ఫ్లైట్స్ అన్ని కూడా లాటిన్ అమెరికా దేశాలైన గ్వాటెమాలా, మెక్సికోకు పంపారు.
వార్తా కథనాల ప్రకారం, భారతదేశానికి పంపించిన అక్రమ భారతీయ వలసదారుల మిలిటరీ ప్లేన్ 4 జనవరి 2025న మొదలై 5వ తారీఖున అమ్రిత్సర్ నగరంలో ల్యాండ్ అయ్యింది. ఈ ప్లేన్ యొక్క వీడియోని అమెరికా యొక్క బోర్డర్ పాట్రోల్ చీఫ్ మైకేల్ W బ్యాంక్స్ 5 ఫిబ్రవరి 2025న తన ‘X’ అకౌంటులో పోస్ట్ చేశారు. సంకెళ్లు వేయబడ్డ భారతీయులను మీరు ఈ వీడియోలో ఇక్కడ చూడవచ్చు. దీనిబట్టి వైరల్ వీడియో భారతీయులను తరలించినప్పుడు తీసిన వీడియో కాదు అని మనకు స్పష్టం అవుతుంది.
ముందుగా, వైరల్ ఫోటోలో “హిడాల్గో, టెక్సాస్” అని ఒక టెక్స్ట్ ఉండటం మేము గమనించాము. దీన్ని వెరిఫై చేయడానికి వైరల్ ఫోటోను ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, ఒక వెరిఫైడ్ X యూజర్ @viralnewsnyc 30 జనవరి 2025న షేర్ చేసిన వీడియో (ఆర్కైవ్ లింక్) ఒకటి దొరికింది. ఈ వీడియోలోని ఒక కీ ఫ్రేమ్ వైరల్ పోస్టులో ఉంది, ఇందులో కూడా వైరల్ ఫొటోలో ఉన్న టెక్స్ట్ ఉంది. ఇది 04 ఫిబ్రవరి 2025న US నుండి భారతీయ అక్రమ వలసదారులను తరలించడానికి ముందు అప్లోడ్ చేయబడింది. ఈ వీడియో యొక్క వివరణలో “Border patrol walking them right back into Mexico.” అని ఉంది.
దీని ఆధారంగా, మేము ఒక కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, స్థానిక వార్తా సంస్థ KRGV (ఆర్కైవ్ లింక్) వారు ప్రచురించిన ఒక వీడియో రిపోర్ట్ మరియు డైలీ మెయిల్ (ఆర్కైవ్ లింక్) వారు ప్రచురించిన ఒక ఆర్టికల్ మాకు దొరికింది.
వైరల్ ఫొటోలో, @viralnewsnyc పోస్ట్ చేసిన వీడియోలో కనిపించిన వ్యక్తులు ఈ కథనాల్లో కూడా ఉన్నారు. అదనంగా, రాయిటర్స్ (ఆర్కైవ్ లింక్) పోస్టు చేసిన ఒక ఇమేజ్ గ్యాలరీలో KRGV వీడియోలో క్యూ ముందు నిలబడి ఉన్న అదే కర్లీ హెయిర్ గల వ్యక్తి ఫోటో ఉంది. ఈ కథనాల ప్రకారం, ఈ వ్యక్తులను మెక్సికోకు తరలించారు. ఇందులో ఉన్నవారు ఒకరు మెక్సికన్ పౌరుడు. ఇతరులు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, క్యూబా, హోండురాస్ నుండి వచ్చారని KRGV వారు తమ నివేదికలో పేర్కొన్నారు.
వైరల్ ఫోటోలో కనిపించిన వ్యక్తులే డైలీ మెయిల్ కథనంలో కూడా కనిపిస్తారు, క్రింద ఉన్న ఫొటోలో మీరు దీన్ని గమనించవచ్చు.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటో ఉన్న ‘ది ఇండిపెండెంట్’ (ఆర్కైవ్ లింక్) వారి వార్తా కథనం మాకు దొరికింది. 30 జనవరి 2025న ప్రచురించబడిన ఈ కథనం ప్రకారం, 80 మంది వలసదారుల బృందాన్ని అదే రోజున USAలోని టెక్సాస్ నుండి గ్వాటెమాలాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇందులో భారతీయ వలసదారుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.
ది ఇండిపెండెంట్ఈ ఫోటో యొక్క క్రెడిట్‌ను అసోసియేటెడ్ ప్రెస్ (AP)కి ఇచ్చింది. AP వారి వెబ్‌సైట్‌లో దీని గురించి వెతకగా, ఈ ఫోటో 30 జనవరి 2025న టెక్సాస్‌లోని ఎల్ పాసోలో తీయబడిందని మాకు తెలిసింది. ఫోటో వివరణలో ఇందులో ఉన్న వారు గ్వాటెమాలాకు చెందిన అక్రమ వలసదారులు అని పేర్కొన్నారు.
అదనంగా, 05 ఫిబ్రవరి 2025న ఈ ఫోటోలో ఉన్నది భారతీయ వలసదారులు కాదు అని,గ్వాటెమాలాకు చెందిన వారు అని PIB ఫ్యాక్ట్ చెక్ (ఆర్కైవ్ లింక్) X పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చింది.
ఈ ఫోటో గురించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇది గ్వాటెమాలా దేశ అక్రమ వలసదారులను అమెరికా డిపార్ట్ చేసినప్పటి ఫోటో అని మాకు తెలిసింది. ఈ ఫోటో యొక్క అసలు వెర్షన్ గెట్టి ఇమేజ్ అనే స్టాక్ ఇమేజ్ వెబ్సైటులో ఉంది. ఈ ఫోటో వివరణలో ‘Guatemalan migrants deported from the United States on a U.S. military plane walk down the runway at the Guatemalan Air Force Base in Guatemala City on January 30, 2025.’ అని ఉంది
చివరగా, అమెరికా నుండి అక్రమ భారతీయ వలసదారులను తరలిస్తున్న దృశ్యాలు అని సంబంధం లేని వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.