భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు 17 మే 2025న అరెస్టు చేశారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో, జ్యోతి మల్హోత్రా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఫోటోలు రెండు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ ఫోటోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోలు.
ఫాక్ట్(నిజం): గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఉన్న ఈ వైరల్ ఫోటోలు అసలైన ఫోటోలను ఎడిట్ చేస్తూ రూపొందించారు. అసలైన ఫోటోలలో ఉన్న మహిళల ముఖాలను యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ముఖంతో మార్ఫింగ్ చేయడం ద్వారా ఈ వైరల్ ఫోటోలు సృష్టించబడ్డాయి. రాహుల్ గాంధీతో ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాయ్‌బరేలి ఎమ్మెల్యే అదితి సింగ్ ఉన్న ఫోటోను ఎడిట్ చేస్తూ మొదటి ఫోటోను రూపొందించారు. కేరళలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా సెప్టెంబర్ 2022లో రాహుల్ గాంధీ ఓ కాంగ్రెస్ పార్టీ మద్దతురాలితో దిగిన ఫోటోను ఎడిట్ చేస్తూ రెండవ ఫోటోను రూపొందించారు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఫోటో-1:
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటి ఫోటోనే (అసలైన ఫోటో) రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, అసలైన ఫోటోలో రాహుల్ గాంధీతో ఉన్నది ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాయ్‌బరేలి ఎమ్మెల్యే అదితి సింగ్.
వైరల్ ఫోటోను అసలైన ఫోటోతో పోల్చి చూస్తే, అసలు ఫోటోను యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ముఖంతో మార్ఫింగ్ చేస్తూ వైరల్ ఫోటో రూపొందించారు అని స్పష్టమవుతుంది .
ఫోటో-2:
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటి ఫోటోనే 18 సెప్టెంబర్ 2022న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్లు మేము గుర్తించాము. ఈ క్రమంలోనే ఇదే ఫోటోతో కూడిన వేరొక రిపోర్ట్ కూడా లభించింది. “18 సెప్టెంబర్ 202న కేరళలోని అలప్పుజలో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఒక మద్దతురాలిని కౌగిలించుకుంటున్నారు” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటో ప్రచురించబడింది.
వైరల్ ఫోటోను అసలైన ఫోటోతో పోల్చి చూస్తే, అసలు ఫోటోను యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ముఖంతో మార్ఫింగ్ చేస్తూ వైరల్ ఫోటో రూపొందించారు అని స్పష్టమవుతుంది.
అలాగే ఫేస్-స్వాపింగ్/మార్ఫింగ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేయడానికి, మేము ఒక AI- ఆధారిత ఫేస్ స్వాపింగ్ టూల్ ని ఉపయోగించి, అసలైన ఫోటోలలో ఉన్న మహిళల ముఖాలను యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ముఖంతో మార్ఫింగ్ చేశాము. ఆ ఫలితాలను క్రింద చూడవచ్చు.
చివరగా, గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఉన్న ఈ వైరల్ ఫోటోలు అసలైన ఫోటోలను ఎడిట్ చేస్తూ రూపొందించారు.