“భారత పార్లమెంట్ ఆవరణలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు” అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల 2024లో భారత పార్లమెంట్ ఆవరణలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు, అందుకు సంబంధించిన ఫోటోలు.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలు 19 డిసెంబర్ 2024న ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినవి. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ ఫోటోలకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే ఫొటోను రిపోర్ట్ చేస్తూ “ఢిల్లీలోని జార్జ్ కురియన్ నివాసంలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ” అనే శీర్షికతో 19 డిసెంబర్ 2024న ఇండియా టీవీ (INDIA TV) వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వైరల్ ఫోటోలు 19 డిసెంబర్ 2024న ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైనప్పుడు తీసినవి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారని పేర్కొంటూ అదే ఫోటోలను రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
19 డిసెంబర్ 2024న ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక X(ట్విట్టర్)లో ఇవే ఫోటోలను షేర్ చేస్తూ “కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యాను, క్రైస్తవ సమాజంలోని ప్రముఖులతో కూడా సంభాషించాను” అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరైన దృశ్యాలను ప్రధాని మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది. అలాగే పలు మీడియా సంస్థలు కూడా కేంద్ర మంత్రి కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మోదీ ఫాల్గొన్న దృశ్యాలను షేర్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ).
ఇటీవల భారత పార్లమెంట్ ఆవరణలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఇటీవల భారత పార్లమెంట్ ఆవరణలో అటువంటి వేడుకలు జరిగినట్లు విశ్వసనీయమైన రిపోర్ట్స్/ఆధారాలు మాకు లభించలేదు.
చివరగా, ఈ వైరల్ ఫోటోలు 19 డిసెంబర్ 2024న ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినవి.