దేశంలో ఒక్క రోజులో జన్మించే పిల్లలో ముస్లిం మతానికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారని అర్ధం వచ్చేలా మొత్తం భారతదేశంలో, ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఒక్క రోజులో జన్మించిన పిల్లల గణాంకాలను మత ప్రాతిపదికన షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: దేశంలో, ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఒక్క రోజులో జన్మించిన పిల్లలలో ముస్లిం మతానికి చెందినవారే అత్యంత ఎక్కువగా ఉంటున్నారు.
ఫాక్ట్(నిజం): Registration of Births and Deaths Act, 1969 ప్రకారం భారతదేశంలో జననాల మరియు మరణాల నమోదు తప్పనిసరి. రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విభాగం ప్రతి సంవత్సరం జననాలు మరియు మరణాలకు సంబంధించిన ముఖ్యమైన గణాంకాలను సేకరిస్తుంది. ఐతే ఈ సమాచారంలో జననాలకు సంబంధించి కేవలం జెండర్ (లింగ) ప్రాతిపదికన డేటాని అందిస్తుంది తప్ప మతాల ప్రాతిపదికన కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
భారతదేశంలో The Registration of Births and Deaths Act, 1969 (RBD Act) దేశవ్యాప్తంగా జననాల మరియు మరణాల నమోదుని తప్పనిసరి చేసింది. రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విభాగం ప్రతి సంవత్సరం జననాలు మరియు మరణాలకు సంబంధించిన ముఖ్యమైన గణాంకాలను సేకరిస్తుంది. ఐతే ఈ సమాచారంలో జననాలకు సంబంధించి కేవలం జెండర్ (లింగ) ప్రాతిపదికన డేటాని అందిస్తుంది తప్ప మతాల ప్రాతిపదికన కాదు. దీన్నిబట్టి, పోస్ట్‌లో మతాల వారిగా జననాలకు సంబంధించి పేర్కొన్నది అధికారిక సమాచారం కాదని, అది కేవలం కల్పితమేనని అర్ధం చేసుకోవచ్చు.
సాధారణంగా భారత ప్రభుత్వం జననాల రేట్‌కి (బర్త్ రేట్) బదులు ఫెర్టిలిటీ రేట్‌ను (సంతానోత్పత్తి రేటు (TFR), ఒక మహిళకు జన్మనిచ్చే వయస్సు ముగిసే వరకు జన్మించిన పిల్లల సంఖ్య) నమోదు చేస్తుంది. మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫెర్టిలిటీ రేట్‌కి సంబంధించిన సమాచారాన్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ద్వారా సేకరిస్తుంది. 2015-16లో విడుదల చేసిన NFHS-4 డేటా ప్రకారం దేశంలో మతాల వారిగా చూసుకుంటే ముస్లింలలో ఫెర్టిలిటీ రేట్ ఇతర మతాల కన్నా అధికంగా ఉంది. ముస్లింలలో అత్యధికంగా 2.62 TFR నమోదు కాగా, హిందువులలో 2.13 నమోదైంది, ఇతర ప్రధాన మతాల TFR రెండు కంటే తక్కువగా ఉంది.
ఐతే ఇటీవల అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే పరిశోధన సంస్థ భారతదేశ జనాభాకి సంబంధించి విశ్లేసిస్తూ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇతర మతాలతో పోలిస్తే ముస్లింల ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ, గతంలో ఉన్న ఫెర్టిలిటీ రేట్ కన్నా అన్ని మతాల ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది. కాకపోతే సంతానం విషయంలో మతాల మధ్య ఉన్న అంతరం గతంలో కంటే చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు, 1992లో ముస్లిం మహిళల హిందూ మహిళల కంటే సగటున 1.1 మంది ఎక్కువ పిల్లలను కలిగి ఉండగా, 2015 నాటికి ఈ అంతరం 0.5 కి తగ్గింది.
ఫెర్టిలిటీ రేట్లో వ్యత్యాసాల కారణంగా భారతదేశంలోని ముస్లిం జనాభా ఇతర మతాల కంటే కొంత వేగంగా పెరిగినప్పటికీ, ఫెర్టిలిటీ రేట్లో వచ్చిన మార్పుల (క్షీణించడం మరియు కన్వర్జ్ అవ్వడం) కారణంగా, 1951తో పోల్చినప్పుడు మతపరంగా భారత జనాభాలో కేవలం స్వల్ప మార్పులు మాత్రమే జరిగాయి. ఈ వాదన పోస్టులో చెప్తున్న వాదనకి పూర్తి బిన్నంగా ఉంది.
ఇదే ప్యూ రీసెర్చ్ సెంటర్ 2050లో మతాలవారిగా భారతదేశ జనాభా ఎలా ఉండబోతుందో విశ్లేషిస్తూ 2015లో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోని చాలా మంది హిందువులకు నిలయంగా ఉంది. 2010 లో, ప్రపంచంలోని 94% మంది హిందువులు భారతదేశంలో నివసించగా, 2050లో కూడా ఇదే విధంగా ఉంటుంది. 2050లో భారతదేశ హిందు జనాభా 130 కోట్లుగా ఉంటుందని’ పేర్కొన్నారు.
అదే సమయంలో తక్కువ మధ్యస్థ వయస్సు కలిగి ఉండడం మరియు అత్యధిక ఫెర్టిలిటీ రేట్ కలిగి ఉన్న కారణంగా భారతదేశంలో ముస్లింల జనాభా హిందువుల కంటే వేగంగా పెరుగుతుందని పేర్కొంది. 2010లో 14.4% గా ఉన్న ముస్లిం జనాభా 2050లో 18.4%కి పెరుగుతుందని అంచనా వేసింది.
చివరగా, ఈ పోస్టులో షేర్ చేసిన మత ప్రాతిపదిక జనన నమోదు గణాంకాలు తప్పు.