LPG గ్యాస్ సిలిండర్‌పై 5% జీఎస్‌టీ ఉంటుంది; కేంద్ర జీఎస్‌టీ – 2.5%, రాష్ట్ర జీఎస్‌టీ – 2.5%

YouTube Poster

వినియోగదారుడు చెల్లించే LPG గ్యాస్ సిలిండర్ ధరలో కేంద్ర ప్రభుత్వ పన్ను ఐదు శాతం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55 శాతం ఉందని చెప్తూ, కొన్ని అంకెలతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వినియోగదారుడు చెల్లించే LPG గ్యాస్ సిలిండర్ ధరలో కేంద్ర ప్రభుత్వ పన్ను ఐదు శాతం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55 శాతం ఉంది.

ఫాక్ట్: LPG గ్యాస్ సిలిండర్‌పై ఐదు శాతం జీఎస్‌టీ ఉంటుంది. వేరువేరుగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట ప్రభుత్వాలు తమకు నచ్చినట్టు పన్నులు వేయవు. LPG గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55 శాతం అనే వాదన తప్పు. 14.2 కేజీ డొమెస్టిక్ LPG గ్యాస్ సిలిండర్ పై డీలర్/డిస్ట్రిబ్యూటర్ కమిషన్ కూడా 61.84 రూపాయలు; పోస్ట్‌లో చెప్పినట్టు 5.50 రూపాయలు కాదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో LPG గ్యాస్ సిలిండర్ ధరకి సంబంధించి వివిధ వివరాలు ఇచ్చారు. అవి ఎంతవరకు నిజమో ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

LPG గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర పన్ను 55 శాతం ఉందా?

LPG గ్యాస్ సిలిండర్‌పై జీఎస్‌టీ ఉంటుంది. వేరువేరుగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట ప్రభుత్వాలు తమకు నచ్చినట్టు పన్నులు వేయవు. LPG గ్యాస్ సిలిండర్‌పై ఐదు శాతం జీఎస్‌టీ [CGST (కేంద్ర జీఎస్‌టీ) – 2.5 శాతం + SGST (రాష్ట్ర జీఎస్‌టీ) – 2.5 శాతం] ఉన్నట్టు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవొచ్చు. ఇదే విషయం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘Petroleum Planning & Analysis Cell (PPAC)’ విడుదల చేసిన ‘Ready Reckoner’ (నవంబర్ 2020) డాక్యుమెంట్‌లో కూడా చూడవొచ్చు.

ఉదాహరణకి, కింద ఫోటోలోని 14.2 కేజీ LPG గ్యాస్ సిలిండర్ బిల్ చూడవొచ్చు. ఆ LPG గ్యాస్ సిలిండర్‌ బిల్లులో కేంద్ర జీఎస్‌టీ (CGST) – 2.5 శాతం మరియు రాష్ట్ర జీఎస్‌టీ (SGST) – 2.5 శాతం ఉన్నట్టు గమనించవొచ్చు. కాబట్టి, LPG గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55 శాతం అనే వాదన తప్పు.

డీలర్ కమిషన్ ఎంత?

పోస్ట్‌లో డీలర్ కమిషన్ 5.50 రూపాయలు అని ఇచ్చినట్టు చూడవొచ్చు. అయితే, 14.2 కేజీ LPG గ్యాస్ సిలిండర్ పై డీలర్/డిస్ట్రిబ్యూటర్ కమిషన్ 61.84 రూపాయలని PPAC వారి వెబ్‌సైట్‌లో చూడవొచ్చు. డీలర్ కమిషన్‌ని 61.84 రూపాయలకు పెంచుతూ జులై 2019లో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ని ఇక్కడ చదవొచ్చు. 61.84 రుపాయలలో 34.24 రూపాయలు ఎస్టాబ్లిష్మెంట్ చార్జీలని, 27.60 రూపాయలు డెలివరీ చార్జీలని తెలిసింది. కాబట్టి, పోస్ట్‌లో ఇచ్చిన డీలర్ కమిషన్ వివరాలు కూడా తప్పు.

LPG గ్యాస్ సిలిండర్‌ ధరలో పన్నులు, డీలర్ కమిషన్ కాకుండా ఇంకేమి ఉంటాయి?

కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన ‘Indian Petroleum & Natural Gas Statistics 2019-20’ రిపోర్ట్‌లో భారత్‌లోని నాలుగు ప్రధాన నగరాలకి సంబంధించి 01 ఏప్రిల్ 2020 న LPG గ్యాస్ సిలిండర్‌ ధరలకు సంబంధించిన వివరాలు ఇచ్చినట్టు చూడవొచ్చు. ‘Market Determined Price’, Distributor Commission (డిస్ట్రిబ్యూటర్ కమిషన్), GST (జీఎస్‌టీ) – లను కలిపితే LPG గ్యాస్ సిలిండర్‌ ధర (‘Retail Selling Price’) వస్తున్నట్టు చూడవొచ్చు. ఢిల్లీకి సంబంధించిన 01 జూన్ 2021 ధర వివరాలు ఇక్కడ చూడవొచ్చు. జీఎస్‌టీ , డిస్ట్రిబ్యూటర్ కమిషన్ గురించిన వివరాలు పైన చూసాము. ‘Market Determined Price’ లో ఏం ఉంటాయో చూద్దాం.

‘Market Determined Price’ అంటే?

PPAC’ విడుదల చేసిన ‘Ready Reckoner’ (జూన్ 2018) డాక్యుమెంట్ లో, ‘Market Determined Price’ లో ఉండే వివిధ భాగాల వివరాలు చూడవొచ్చు. ఇందులో కొన్ని భాగాల ఖర్చు రాష్ట్రాలని బట్టి మారుతుంది. ఈ తేడాలు పన్నుల వల్ల కాదు, ఆయా రాష్ట్రాలు ఉన్న లొకేషన్, అక్కడ బాట్లింగ్ చేస్తున్న కంపెనీ తదితర కారణాల వల్ల.

చివరగా, LPG గ్యాస్ సిలిండర్‌పై ఐదు శాతం జీఎస్‌టీ ఉంటుంది; సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55 శాతం అనే వాదన తప్పు. 

వివరణ (OCTOBER 22, 2021):
ఇదే అంశం మీది ఇప్పుడు 976 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ పైన రాష్త్ర పన్ను 27.34 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం పన్ను 685 రూపాయలు అంటూ కొంత మంది షేర్ చేస్తున్నారు. కానీ పైన వివరించినట్టు గ్యాస్ సిలిండర్ జీఎస్‌టీ పరిధిలోకి వస్తుంది; అందులో కేంద్ర మరియు రాష్త్ర ప్రభుత్వాల వాటా సమానం (ఒక్కొక్కరిది 2.5%).