విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో స్పష్టం చేసిందనే వార్తలో నిజం లేదు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో స్పష్టం చేసింది అని చెప్తూ ఉన్న ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా కథనంతో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో స్పష్టం చేసింది.

ఫాక్ట్(నిజం): 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- RINL)పై వైసీపీ (YSRCP) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో ఎక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని పేర్కొనలేదు. అంతేకాకుండా, ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ 27 జనవరి 2021న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారత ప్రభుత్వ వాటాను 100 శాతం ఉపసంహరించుకోవడానికి ఆమోదం తెలిపిందని ఈ సమాధానంలో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేసే ప్రతిపాదన తమ (కేంద్రం) పరిశీలనలో లేదని ఈ సమాధానంలో వెల్లడించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- RINL)పై వైసీపీ (YSRCP) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాన్ని మనం పరిశీలిస్తే, ఈ సమాధానంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబడటం లేదని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సమాధానంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ యథాతథంగా నడవడానికి రూ. 11,440.00 కోట్ల నిధులను అందించేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇప్పటికే త్రైమాసిక లక్ష్యాల ప్రకారం రూ. 9,824.00 కోట్ల మొత్తాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు విడుదల చేసినట్టుగా పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) అమలును ప్రకటించారా? అనే ప్రశ్నకు, VRS అమలును విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రకటించిందని, VRS కు దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 17 జూలై 2025 అని, సమర్పించిన దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 18 జూలై 2025 అని, చివరి తేదీ నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని 1,017 మంది ఉద్యోగులు VRS కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాధానంలో తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి లేదా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడానికి ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 27 జనవరి 2021న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారత ప్రభుత్వ వాటాను 100 శాతం ఉపసంహరించుకోవడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే పరిస్థితి ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) తో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం ఈ సమాధానంలో వెల్లడించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారత ప్రభుత్వ వాటాను 100 శాతం ఉపసంహరించుకోవడానికి చేసిన ప్రతిపాదనను 27 జనవరి 2021న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 2021లో శాసనసభలో తీర్మానం చేసింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

అలాగే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL) ప్రైవేటీకరణకు సంబంధించి 2021 నుండి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో భారత ప్రభుత్వ వాటాను 100 శాతం ఉపసంహరించుకునే నిర్ణయాన్ని సమీక్షించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అయితే, జనవరి 2025లో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది (ఇక్కడ, ఇక్కడ).

అలాగే, 2025 జనవరిలో విశాఖపట్నం సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. జూలై 2024లో కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని తెలిపారు. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

చివరగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో స్పష్టం చేసిందనే వార్తలో నిజం లేదు.