ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించలేదు; ఆమెపై నమోదైన కేసుల విచారణ ఇంకా ముగియలేదు

“ఇటీవల బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు హసీనా మంత్రివర్గ సహచరులకు మరణశిక్ష విధించింది. ఈ విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది.

ఫాక్ట్(నిజం): ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించలేదు. ఆమెపై నమోదైన కేసుల విచారణ ఇంకా ముగియలేదు. 05 ఆగస్టు 2024న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారతదేశానికి వచ్చారు. అప్పటి నుండి షేక్ హసీనా భారత్‌లోనే ఉన్నారు. హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టిన తర్వాత, హసీనా, ఆమె సహచరులపై హత్య, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, మారణహోమం, కిడ్నాప్ మరియు హత్యాయత్నం ఆరోపణలపై 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే, షేక్ హసీనా మరియు పలువురు అవామీ లీగ్‌ అగ్ర నేతలపై బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (International Crimes Tribunal, ICT) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది, షేక్ హసీనా సహా పరారీలో ఉన్న వారిని అరెస్టు చేసి 18 నవంబర్ 2024లోగా ట్రిబ్యునల్ ముందు హాజరుపరచాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ICT ఆదేశించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

బంగ్లాదేశ్‌లో కోటా వ్యతిరేక ఉద్యమంగా జూలై 2024లో ప్రారంభమైన నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా పరిణామం చెంది, తీవ్ర రాజకీయ అనిశ్చితికి దారి తీశాయి. దీంతో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 05 ఆగస్ట్ 2024న రాజీనామా చేసి దేశం విడిచి భారతదేశానికి వెళ్లిపోయారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రధానమంత్రిగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.

05 ఆగస్టు 2024 నుంచి షేక్ హసీనా భారత్‌లోనే ఉన్నారు. ఇటీవల అక్టోబర్ 2024లో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ షేక్ హసీనా ఇంకా భారతదేశంలోనే ఉన్నారని తెలిపినట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).

ఇకపోతే, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిందా? అని తగిన కీవర్డ్స్( బెంగాలీ భాషలో కూడా) ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష షేక్ హసీనాకు విధించినట్లు ఎలాంటి  విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ ఇలాంటి పరిణామం జరిగి ఉంటే అంతర్జాతీయ మీడియా సంస్థలు కచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేవి.

ఈ క్రమంలోనే, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి అని తెలిసింది. పలు రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరియు ఆమె సహచరులపై హత్య, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, మారణహోమం, కిడ్నాప్ మరియు హత్యాయత్నం ఆరోపణలపై 150కి పైగా కేసులు నమోదయ్యాయి.

ఇటీవల, 17 అక్టోబర్ 2024న, జూలై-ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన మారణహోమానికి సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరియు పలువురు అవామీ లీగ్‌ అగ్ర నేతలపై బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (International Crimes Tribunal) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే, షేక్ హసీనాతో సహా పరారీలో ఉన్న వారిని అరెస్టు చేసి 18 నవంబర్ 2024లోగా ట్రిబ్యునల్ ముందు హాజరుపరచాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ICT ఆదేశించింది.

ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం BBC బంగ్లాతో మాట్లాడుతూ, “అధికారికంగా, అరెస్ట్ వారెంట్ మా తరపున బంగ్లాదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి వెళ్ళింది. పరారీలో ఉన్న ఫాసిస్ట్ ముఠాను ఇంటర్‌పోల్ ద్వారా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పట్టుకుని న్యాయం చేస్తామని” అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాపై రెడ్ నోటీస్ జారీ చేయాలని అభ్యర్థించినట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).  

ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు.ఇంటర్‌పోల్ (INTERPOL)లోని సభ్య దేశం లేదా అంతర్జాతీయ ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన “కావాల్సిన వ్యక్తుల (wanted persons)” అభ్యర్థనల మేరా ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు (Red notice) జారీ చేస్తుంది. రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్‌పోల్ సభ్య దేశాలను అభ్యర్థించడం. వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఇంటర్‌పోల్ సభ్య దేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేస్తాయి. భారతదేశం 1949 నుండి సంస్థలో సభ్యదేశంగా ఉంది. అయితే ఇంటర్‌పోల్ వెబ్‌సైట్‌ను పరిశీలించగా, షేక్ హసీనాపై ఇంటర్‌పోల్ ఇంకా ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిసింది.

ఈ సమాచారం ఆధారంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టులు/సుప్రీం కోర్ట్ మరణశిక్ష విధించలేదని మరియు ఆమెపై నమోదైన కేసుల విచారణ ఇంకా ముగియలేదని మనం నిర్ధారించవచ్చు. అలాగే, మేము బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల వివరాలు మరియు ఈ కేసుల విచారణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ వర్గాలను మరియు చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లామ్‌ను సంప్రదించాము, వారి నుండి మాకు సమాచారం అందిన వెంటనే ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాము.  

చివరగా, ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది అనే వాదనలో నిజం లేదు; ఆమెపై నమోదైన కేసుల విచారణ ఇంకా ముగియలేదు.