తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో ధరలు తగ్గాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

“తిరుమల కొండపై హోటళ్లలో నేటినుంచి క్రింద కనబరచిన ధరలకన్నా ఎక్కువ ధర ఎవరైనా వసూలు చేసినచో ఈ నంబరుకి 18004254141 తెలియజేయండి – దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం” అని చెప్తున్న పోస్ట్ ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) /ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిందని పేర్కొంటూ ఈ పోస్టును షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను టీటీడీ/ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది, అందుకు సంబంధించిన వివరాలు.

ఫాక్ట్(నిజం): తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను టీటీడీ/ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది అనే వార్తలో ఎటువంటి నిజంలేదు. ఈ వార్త ఫేక్ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పత్రిక ప్రకటనలో, X(ట్విట్టర్) పోస్ట్‌లో స్పష్టం చేసింది. ఈ వైరల్ పోస్టులో ఉన్న ‘ధరల జాబితా’ను రిపోర్ట్ చేస్తూ 2017లో పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను టీటీడీ/ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. తదుపరి, మేము తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించగా, తిరుమల కొండలోని హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలు తగ్గించబడ్డాయని వివిధ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్తూ టీటీడీ విడుదల చేసిన పత్రికా ప్రకటన లభించింది. “ఇటీవలి కాలంలో ‘తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు’ పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక మెసేజ్‌ టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ సమాచారం పూర్తిగా వాస్తవ దూరం. ఈ మెసేజ్‌లో పేర్కొన్న భోజన ధరలు, ఇతర వివరాలు పూర్తిగా కల్పితం” అని టీటీడీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్‌సైట్ (www.tirumala.org), టీటీడీ కాల్ సెంటర్ (18004254141) ద్వారా మాత్రమే తెలుసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇదే విషయాన్ని పేర్కొంటూ TTD వారి అధికారిక X(ట్విట్టర్)లో 02 జూలై 2025న పోస్ట్ చేసింది. అలాగే, తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈ పోస్ట్‌లో పేర్కొంది.

అలాగే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో ధరలు తగ్గాయని చెబుతూ ప్రస్తుతం వైరల్ అవుతున్న ధరల జాబితా కనీసం 2017 నుండి ప్రతి సంవత్సరం సోషల్ మీడియాలో షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ వైరల్ జాబితాకు సంబంధించిన మరింత సమాచారం కోసం, తగిన అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, ఈ జాబితాను 2017లో పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, ఫిర్యాదులు ఇచ్చినా స్పందించట్లేదని పేర్కొంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (WP(PIL) 148/2016) దాఖలు చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పిటిషన్‌ను అక్టోబర్ 2017లో విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, కొండపై ఉన్న హోటళ్లకు ‘ధరల జాబితా’ను టీటీడీ విడుదల చేసింది అని ఈ కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాలలో రిపోర్ట్ చేసిన ధరలు ఈ వైరల్ ‘ధరల జాబితా’కు సరిపోలుతున్నాయి. దీన్ని బట్టి వైరల్ పోస్టులో ఉన్న ‘ధరల జాబితా’ 2017 నాటది అని మనం నిర్ధారించవచ్చు.

పరిహర సేవా సమితి దాఖలు చేసిన పిల్ (WP(PIL) 148/2016)ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హోటళ్లు అధిక ధరలు వసూలు చేయకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ అదేశిస్తూ జూలై 2018లో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెలువరించింది.

ఈ వైరల్ ‘ధరల జాబితా’ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మేము టీటీడీ అధికారులను కూడా సంప్రదించాము, వారి నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో ధరలు తగ్గాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది