కాస్మిక్ కిరణాల బారినుంచి రక్షణ పొందడానికి రాత్రిపూట సెల్ ఫోన్లను ఆఫ్ చేయాలంటూ ప్రచారంలో ఉన్న ఈ పోస్టులో నిజం లేదు

ఈరోజు రాత్రి 12.30 నుండి 03.30 వరకు కాస్మిక్ కిరణాలు భూమికి దగ్గరగా వెళ్తాయని, అందువలన భూగ్రహం ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది గనుక ప్రజలందరూ సెల్ ఫోన్లు, టాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి వాటిని శరీరానికి దూరంగా ఉంచాలని గూగుల్, నాసా, బిబిసి, సిఎన్ఎన్ సంస్థలు ప్రజలను హెచ్చరించాయని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: ఈ రోజు రాత్రి కాస్మిక్ కిరణాలు భూమికి దగ్గరగా వెళ్తున్నందున ప్రజలందరూ ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి వాటిని శరీరానికి దూరంగా ఉంచాలని గూగుల్, నాసా, బిబిసి, సిఎన్ఎన్ సంస్థలు ప్రజలను హెచ్చరించాయి.

ఫాక్ట్: ఈ పోస్టు కనీసం 2010 నుంచి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ప్రచారంలో ఉంది. నాసా, బిబిసి, సిఎన్ఎన్ వెబ్‌సైట్లలో ఎక్కడా ఇటువంటి హెచ్చరిక జారీ కాలేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కూడా ఇది తప్పుడు సమాచారమని 2019లో స్పష్టం చేసింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇదే సమాచారంతో ఉన్న పోస్టులు కనీసం 2010 నుంచే సోషల్ మీడియాలో ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రచారంలో ఉన్నట్లు గుర్తించాం. పైగా పోస్టులో చెప్పినట్లుగా నాసా, బిబిసి, సిఎన్ఎన్ వెబ్‌సైట్లలో కూడా ఈ విషయంపై ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

ఇక గూగుల్లో ఈ విషయంపై మరింత సమాచారం కోసం వెతకగా, గతంలో ఇదే పోస్టు వివిధ దేశాలలో వైరల్ కాగా, అనేక వార్తా సంస్థలు  నిపుణులను సంప్రదించి, దీన్ని తప్పుడు సమాచారంగా నిర్ధారించాయి. సంబంధిత కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అలాగే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కూడా ఇది తప్పుడు సమాచారమని 2019లో విశ్వాస్ న్యూస్‌కి ఇచ్చిన వివరణలో స్పష్టం చేసింది.  

Centre for Disease Control and Prevention (CDC) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, అంతరిక్షం నుంచి వచ్చే తక్కువ శక్తిగల ఈ కాస్మిక్ రేడియేషన్‌కి మనం నిరంతరం గురవుతూనే ఉంటాం. అయితే ఈ తరహా రేడియేషన్‌ మానవుల ఆరోగ్యానికి హానికరం కాదు. ఇక ఎలక్ట్రానిక్ పరికరాలు, పవర్ గ్రిడ్‌లను ప్రభావం చేయగల సూర్యుడు మరియు ఇతర నక్షత్రాల నుంచి వచ్చే వివిధ కిరణాలను కూడా National Oceanic and Atmospheric Administration ఎప్పటికప్పుడు పరీక్షించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది.

చివరిగా, కాస్మిక్ కిరణాలు భూమికి దగ్గరగా వెళ్తున్నందున ప్రజలందరూ ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ రోజు రాత్రి ఆఫ్ చేయాలని హెచ్చరిస్తున్న ఈ సమాచారంలో ఎంత మాత్రం నిజం లేదు.