ఇందిరా గాంధీ హయాంలో కేవలం హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

హిందువుల జనాభాను తగ్గించి, ముస్లింల జనాభాను తగ్గించడమే లక్ష్యంగా ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని రూపొందించిందని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A screenshot of a cellphone

AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని హిందువుల జనాభాను తగ్గించి, ముస్లింల జనాభాను తగ్గించడమే లక్ష్యంగా రూపొందించింది.

ఫాక్ట్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం హిందువులకు మాత్రమే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులకి చేసినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా మతం ఆధారంగా కాకుండా అందరికీ ఒకే విధంగా ఇస్తున్నట్లు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

భారతదేశ జనాభాని నియంత్రించడానికి ప్రభుత్వం 1952 నుంచి వివిధ జనాభా నియంత్రణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 1960 దశకం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను (ట్యూబెక్టమీ, వేసెక్టమీ మొదలైనవి) కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం అమలుచేసింది. ఇందులో భాగంగా, 1975-77లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అమలుచేసిన జాతీయ జనాభా విధానం (National Population Policy) ద్వారా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పనిసరి చేయబడ్డాయి. ఈ ఆపరేషన్లను చేయించుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రోత్సాహకాలను అందించేవి. అయితే, తప్పనిసరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై వ్యతిరేకత రావడంతో తరువాత ఈ పాలసీని సడలించి ప్రజలను స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహించారు. కుల, మత, సామాజిక వర్గ ప్రాతిపదికిన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు.

A screenshot of a document

AI-generated content may be incorrect.

ఇక ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో (1966-77 & 1980-84), ముస్లింలు, క్రిస్టియన్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను వ్యతిరేకించారా అని మే 1970లో  రాజ్యసభలో ప్రశ్నించగా, మతపరమైన సంస్థలు వ్యతిరేకించలేదు కానీ కొందరు వ్యక్తులు విముఖత వ్యక్తం చేశారని ప్రభుత్వం సమాధానమిచ్చింది. అయితే, మతాల వారీగా అప్పటికి అధికారిక విశ్లేషణ లేకపోయినా, కొన్ని ప్రాథమిక అధ్యయనాల ప్రకారం అన్ని మతాలకు చెందిన ప్రజలను తమ తమ జనాభా నిష్పత్తికి దాదాపు సమానంగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేయించుకున్నారని ప్రభుత్వం పేర్కొంది.

అలాగే, 12 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో మతాల వారీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారి గణాంకాలను 1973లో ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని మతాల వారు ఇందులో పాల్గొన్నట్లు క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇక ఆపరేషన్లు చేయించుకున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం, లాటరీ టికెట్లు, తక్కువ వడ్డీతో రుణాలు మొదలైన ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రకటించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) . వీటిని కూడా సామాజిక వర్గం ఆధారంగా కాకుండా అందరికీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పై ఆధారాలను బట్టి, కుంటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం హిందువులకి మాత్రమే చేస్తున్నారనే వాదనలో నిజం లేదని నిర్ధారించవచ్చు.

చివరిగా, ఇందిరా గాంధీ హయాంలో కేవలం హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.