14 నవంబర్ 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని NDA కూటమి రాష్ట్రంలోని 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, ఆర్‌జేడీ, ఇతర పార్టీల కూటమి అయిన MGB కూటమి 35 సీట్లు గెలుపొందింది. ఇతరులు 5 స్థానాల్లో గెలిచారు.
ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 100% కంటే ఎక్కువుగా ఉందని, మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు ఉండగా, 7.45 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 2025 బీహార్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు ఉండగా, 7.45 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి.
ఫాక్ట్: ఎన్నికల సంఘం సవరించిన తుది గణాంకల ప్రకారం, బీహార్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య సుమారు 7.45 కోట్లు. పోలింగ్ శాతం 67.13% గా నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టల్ బ్యాలట్ ఓట్లను కలుపుకొని మొత్తం పోల్ అయిన ఓట్లు 5.0185 కోట్లు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను సవరించడానికి, మెరుగుపరచడానికి భారత ఎన్నికల సంఘం Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియ 24 జూన్ 2025 నుంచి మొదలవగా 30 సెప్టెంబర్ 2025న విడుదల చేయబడ్డ సవరించిన తుది ఓటర్ల జాబితాతో పూర్తయ్యింది. ఈ జాబితా ప్రకారం, రాష్ట్రంలో సుమారు 7.42 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.
అయితే, అర్హత ఉన్న ఓటర్ల జాబితాలో తమ పేరు లేనివారు నామినేషన్లకు చివరి తేదీ (20 అక్టోబర్ 2025) కన్నా పదిరోజుల ముందు (10 అక్టోబర్ 2025) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇదే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 05 అక్టోబర్ 2025న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇదే క్రమంలో, 06 అక్టోబర్ 2025న ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్లో అప్పటివరకు నమోదైన ఓటర్ల సంఖ్య 7,43,55,976 అని పేర్కొంది.
అలాగే, 11 నవంబర్ 2025న రెండు విడతల పోలింగ్ ముగిశాక ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎలక్టర్లు (Electors), అనగా, ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వ్యక్తుల సంఖ్య 7,45,26,858 గా ఉందని పేర్కొన్నారు. అయితే, ఈ సంఖ్య ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్లను మాత్రమే చూపుతుంది కానీ పోల్ అయిన ఓట్లను కాదు. పైగా, సర్వీస్ ఓటర్లు, ట్రాన్స్జెండర్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మినహాయిస్తే అప్పటి వరకు అందిన ప్రాథమిక పోలింగ్ శాతం 66.91% ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. 2,027 పోలింగ్ కేంద్రాల సమాచారం ఇంకా అప్డేట్ చెయ్యలేదని ఇందులో పేర్కొనబడింది.
ఇక, 13 నవంబర్ 2025న ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, సవరించిన పోలింగ్ శాతం 67.13% గా ఉంది. దీని ప్రకారం, 7.45 కోట్ల ఓటర్లలో సుమారు ఐదు కోట్లు మంది మాత్రమే ఓటు వేశారని తెలుస్తుంది. ఎన్నికల సంఘం ‘ఎలెక్టర్స్ (electors)’ అని పేర్కొన్నది ఓటు హక్కు ఉన్న మొత్తం వారి సంఖ్య. ‘ఎలెక్టర్స్ (electors)’ అంటే ఓట్ వేసిన వాళ్ళు అని అర్థం కాదు.
పార్టీల వారీగా, నియోజకవర్గాల వారీగా వచ్చిన ఓట్ల సంఖ్యను (పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని) ఎన్నికల సంఘం వెబ్సైట్లో చూడవచ్చు. దీని ప్రకారం, మొత్తం పోల్ అయిన ఓట్లు 5.0185 కోట్లుగా ఉంది. పై ఆధారాలను బట్టి, ఓటర్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టమవుతుంది.
చివరిగా, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల కంటే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.