“ఎలోన్ మస్క్ 2024 చివరిలో టెస్లా పై మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారు” అని క్లెయిమ్ చేస్తూ “టెస్లా మోడల్ పై” అనే పేరు గల మొబైల్ ఫోన్ ఫోటోలు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోన్లు సూర్య రష్మితో ఛార్జ్ అవుతాయని, టెస్లా యొక్క స్టార్ లింక్ ఉపగ్రహంతో ఆ మొబైల్ ఫోన్ యొక్క ఇంటర్నెట్ పని చేస్తుంది అనే క్లెయిమ్స్ చేస్తూ ఈ ఫొటోలని యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఎలాన్ మస్క్ 2024 చివర్లో టెస్లా పై అనే మొబైల్ ఫోన్లని లాంచ్ చేయబోతున్నాడు.
ఫ్యాక్ట్(నిజం): టెస్లా వారు 2024 చివర్లో మొబైల్ ఫోన్/ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు అని ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. టెస్లా వాళ్లు మొబైల్ ఫోన్ విడుదల చేయట్లేదు అని, స్వయానా ఎలాన్ మాస్క్, జో రోగన్ పోడ్కాస్ట్‌లో ఇటీవల స్పష్టం చేసాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, టెస్లా 2024 చివరికి “పై’ ఫోన్‌లు విడుదల చేస్తుంది అన్న క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. కానీ ఈ విషయాన్ని ద్రువీకరిస్తూ, మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. టెస్లా వారి అఫీషియల్ “X” అకౌంట్లో కానీ, వెబ్సైటులో కానీ, ఎలాన్ మస్క్ యొక్క “X” అకౌంట్లో కానీ, ఎక్కడా కూడా టెస్లా కంపెనీ మొబైల్ ఫోన్లని విడుదల చేస్తుంది అని చెప్పి ఎటువంటి ప్రకటనలు మాకు దొరకలేదు. అలాగే, ఈ క్రమంలో, ఈ విషయం పైన ఎలాన్ మస్క్ ఇటీవల జో రోగన్ పోడ్కాస్ట్‌లో మాట్లాడాడు అని మాకు తెలిసింది.
టెస్లా ఫోన్లను ఎలాన్ మస్క్ విడుదల చేస్తున్నాడు అని యూట్యూబ్లో చాలా వీడియోలు వస్తు ఉంటాయి అని, వాటిలో ఎంత నిజం ఉంది అని జో మాస్కును ప్రశ్నించాడు. దీనికి బదులుగా “మేము ఫోన్‌ను (విడుదల) చేయట్లేదు” అని అతను చెప్పాడు. తప్పనిసరి పరిస్థితులు వస్తే తప్పు టెస్లా ఇప్పుడు మొబైల్ ఫోన్ తయారీ గురించి ఆలోంచించట్లేదు అని ఎలాన్ ఈ పోడ్కాస్ట్‌లో స్పష్టం చేశాడు (ఇక్కడ, ఇక్కడ).
ఇదే విషయం పైన మస్క్, జూన్ 2024లో ఒక లైవ్ స్ట్రీమ్ సందర్భంగా మాట్లాడుతూ, టెస్లా ఫోన్లను తయారు చేయట్లేదు అని ఒక వివరణ ఇచ్చాడు అని డెక్కన్ క్రానికల్ ఒక వార్తా కథనంలో పేర్కొనింది. గతంలో ఎలాన్ మస్క్ “X” ద్వారా కొందరికి ఈ విషయంపైన స్పష్టత ఇచ్చాడు. టెస్లా మొబైల్ ఫోన్లని తయారు చేయట్లేదు అని 14 సెప్టెంబర్ 2020 తను చేసిన ఒక ట్వీట్ ద్వారా తను స్పష్టం చేశాడు.
అలాగే, నవంబర్ 2022లో ఆపిల్ మరియు గూగుల్ తమ యాప్ స్టోర్‌ల నుండి ట్విట్టర్‌ను తీసేస్తే, మస్క్ ఒక ఆల్టర్నేట్/ ప్రత్యామ్నాయ ఫోను తయారు చేయాలి అని లిజ్ వీలర్ అనే ఆమె ట్వీట్ చేశారు. దానికి స్పందిస్తూ, ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే తను తప్పకుండా ఒక ఆల్టర్నేట్ ఫోన్‌ను తయారు మస్క్ చెప్పాడు.
చివరిగా, టెస్లా 2024 చివర్లో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. వైరల్ అవుతున్న క్లెయిమ్ కేవలం ఒక పుకారు మాత్రమే.