మే 2025 నాటి కొత్త వాట్సాప్ నిబంధనల ప్రకారం, వాట్సాప్ లో మెసేజ్ పంపినప్పుడు మూడు టిక్కులు వస్తే, మీ మెసేజీలు ప్రభుత్వ దృష్టిలోకి వెళ్లిందన్న వాదనలో నిజం లేదు

సోషల్ మీడియాలో వైరల్ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) అవుతున్న ఓ మెసేజ్ ప్రకారం, కొత్త వాట్సాప్‌, ఫోన్ కాల్ నియమాలు అమల్లోకి వచ్చాయని, ఇకపై అన్ని ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయని, సోషల్ మీడియా యాక్టివిటీలను గట్టిగా పర్యవేక్షించనున్నారని చెప్తున్నారు. అంతేకాక, రాజకీయాలు లేదా మతానికి సంబంధించిన ఏవైనా సందేశాలను పంచుకుంటే వారెంట్ లేకుండా అరెస్టుకు దారితీయవచ్చని హెచ్చరిస్తుంది.

ఈ మెసేజ్‌లో వాట్సాప్ లో ఉన్న టిక్ మార్కుల గురించి కూడా ఇలా వివరించారు;

  1. ✓ = మెసేజ్ పంపినట్టు
  2. ✓✓ = మెసేజ్ డెలివర్ అయినట్టు
  3. ✓✓ (నీలం) = మెసేజ్ చదవబడినట్టు
  4. ✓✓✓ (మూడు నీలి టిక్స్) = మెసేజ్ ప్రభుత్వ దృష్టికి వెళ్లిందని
  5. ✓✓✓ (రెండు నీలం, ఒక ఎరుపు టిక్) = ప్రభుత్వం చర్య తీసుకోవచ్చని
  6. ✓✓✓ (ఒక నీలం, రెండు ఎరుపు టిక్) = ప్రభుత్వం సమాచారం చెక్ చేస్తోందని
  7. ✓✓✓(మూడు ఎరుపు టిక్స్) = ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని, త్వరలో కోర్టు సమన్లు వస్తాయంటూ హెచ్చరిస్తోంది.

ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మే 2025లో అమలులోకి వచ్చిన వాట్సాప్ కొత్త నిబంధనల ప్రకారం, పంపిన మెసేజ్‌కు మూడు టిక్కులు కనిపిస్తే, ప్రభుత్వం మీ మెసేజ్‌ను పర్యవేక్షిస్తోందని అర్థం.

ఫాక్ట్(నిజం): వాట్సాప్ లో మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడతాయి. అందువల్ల, వాటిని ప్రభుత్వం చదవదు. ఈ దావాను ఫేక్ అని భారత ప్రభుత్వ ఫాక్ట్ చెకింగ్ విభాగమైన PIB ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ క్లెయిమ్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ తో వాట్సాప్ వెబ్‌సైట్‌లో వెతికితే, FAQ సెక్షన్‌లో టిక్ మార్కుల గురించి వివరాలు కనిపించాయి. అయితే, అక్కడ కేవలం రెండు టిక్కుల వరకు మాత్రమే ఉంది – ఒకటి మెసేజ్ డెలివర్ అయ్యిందా?, రెండోది చదివారా? అనే విషయాల గురించి. మూడు టిక్కుల గురించి వాట్సాప్ వెబ్‌సైట్‌లో ఎక్కడా ఏ సమాచారం లేదు.

ఇదే వెబ్‌సైట్‌లో వాట్సాప్ మెసేజెస్ ఎవరైనా చదవగలరా?’ అని వెతికితే, వాట్స్ ఆప్ లో మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో ప్రొటెక్ట్ చేయబడతాయనీ, వీటిని ప్రభుత్వమే కాదు, వాట్సాప్ సంస్థ కూడా చదవలేదని స్పష్టంగా పేర్కొంది.

ప్రభుత్వ సంస్థలు సమాచారం కోరినప్పుడు, వాట్సాప్, ఫోన్ నంబర్, రిజిస్ట్రేషన్ సమాచారం, లాగ్ డేటా (IP అడ్రస్, డివైస్ వివరాలు), మెటాడేటా (టైమ్‌స్టాంప్‌లు, మెసేజ్ పంపిన వారు–పొందిన వారు) వంటి సమాచారాన్ని ఇవ్వవచ్చు. అలాగే, యూజర్ యాక్టివిటీకి సంబంధించి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్, తాత్కాలిక మెసేజ్‌ల వివరాలు వంటి డేటాను కూడా పంచే అవకాశం ఉంది. అయితే, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల వాట్సాప్ లో పంపుకునే మెసేజ్‌ల కంటెంట్‌ను మాత్రం ఎవరికీ ఇవ్వలేరు.

వైరల్ అవుతున్న ఈ వార్త  ఫేక్ అని భారత ప్రభుత్వ ఫాక్ట్ చెకింగ్ విభాగమైన PIB ఫాక్ట్ చెక్, 05 మే 2025న తన X హ్యాండిల్‌లో స్పష్టం చేసింది. ఈ మెసేజ్ గత కొంతకాలంగా వేర్వేరు రూపాల్లో వైరల్ అవుతోంది. PIB ఫాక్ట్ చెక్ దీనిని ఏప్రిల్ 2020, ఆగస్ట్ 2022, ఫిబ్రవరి 2024లో ఫాక్ట్ చెక్ చేసి, ఫేక్ అని నిర్ధారించింది.

చివరిగా, మే 2025 నాటి కొత్త వాట్సాప్ నిబంధనల ప్రకారం, వాట్సాప్ లో మెసేజ్ పంపినప్పుడు మూడు టిక్కులు వస్తే, మీరు పర్యవేక్షించబడుతున్నారనే వాదనలో నిజం లేదు,