2 ఆగస్టు 2025న భూమిపై సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడడం లేదు, 2 ఆగస్టు 2027న ఏర్పడనుంది


2 ఆగస్టు 2025న ప్రపంచం మొత్తం పగలు ఆరు నిమిషాల పాటు చీకటిగా మారబోతోందని చెప్తున్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 100 సంవత్సరాల తర్వాత ఈ ఆగస్టులో రాబోయే ఒక సూర్య గ్రహణం వల్ల ఈ అరుదైన దృశ్యం కనిపించనుందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2 ఆగస్టు 2025న రాబోతున్న ఒక సూర్యగ్రహణం కారణంగా, ప్రపంచమంతా పగలు ఆరు నిమిషాల పాటు చీకటిగా మారనుంది. 

ఫ్యాక్ట్ (నిజం): 2 ఆగస్టు 2025న సూర్యగ్రహణం ఏర్పడనుందని ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం లేదు. 2 ఆగస్టు 2027న అత్యంత పొడవైన లేదా సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం 6 నిమిషాల 23 సెకన్ల వరకు ఉంటుంది. 1991 నుండి 2114 మధ్య కాలంలో ఇదే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం. కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, 2 ఆగస్టు 2025న సూర్య గ్రహణం ఏర్పడనుంది అని చెప్తూ, మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. NASA వారి అధికారిక వెబ్సైటులో ఉన్న ఒక ఆర్టికల్ ప్రకారం ఈ ఏడాది (2025లో) ఒక్క సూర్యగ్రహణం ఏర్పడనుంది. 21 సెప్టెంబర్ 2025 ఏర్పడనున్న ఈ సూర్యగ్రహణం ఒక partial, అనగా పాక్షిక సూర్యగ్రహణం. 

కానీ, 2027 సంవత్సరంలో అదే నెల అదే తారీఖున అనగా, 2 ఆగస్టు 2027న ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందని NASA వారి అధికారిక వెబ్సైటులో ఉన్న సమాచారం మాకు లభించింది (ఇక్కడ, ఇక్కడ). దీనితో పాటు, ఈ సూర్య గ్రహణం గురించి space.com వారు ప్రచురించిన ఒక కథనం, అలాగే పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇక్కడ) .

సూర్యునికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. space.com వారి కథనం ప్రకారం, ఈ సూర్య గ్రహణం 6 నిమిషాల 23 సెకన్ల వరకు ఉంటుంది. 1991 నుండి 2114 మధ్య కాలంలో ఇదే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం.

అయితే వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా, ఇది ఏర్పడిన రోజున, 2 ఆగస్టు 2027న ప్రపంచం మొత్తం పగటి వేల 6 నిమిషాల పాటు చీకటిమయం అయిపోదు. పైన పేర్కొన్న సంస్థల కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), సంపూర్ణ సూర్యగ్రహణం–అంటే చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా అడ్డుకుంటాడు– స్పెయిన్, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్టు, సౌదీ అరేబియా, యెమెన్ దేశాలలోని కొన్ని ప్రదేశాలలో కనిపిస్తుంది. ఇంకా నార్వే, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, మొరాకో తదితర ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

2 ఆగస్ట్ 2027న ఏర్పడే సూర్యగ్రహణం యొక్క పాత్‌ను (మార్గం), NASA వారు తమ వెబ్సైటులో ఒక మ్యాప్ రూపంలో పెట్టారు (ఇక్కడ, ఇక్కడ). ఇందులో నీలి రంగులో ఉన్న లైన్లు ఉన్న ప్రదేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందని అర్థం, ఈ ప్రదేశాల్లో పూర్తి చీకటి సంభవిస్తుంది. మిగిలిన చోట్ల పాక్షికంగా ఏర్పడుతుంది.

చివరగా, వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా ఈ ఏడాది అనగా 2 ఆగస్టు 2025లో ఈ శతాబ్దంలోని అత్యంత పొడవైన సూర్యగ్రహణం ఏర్పడడం లేదు, 2 ఆగస్టు 2027 ఏర్పడనుంది.