Update (14 June 2022):
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులలో ఎక్కువ శాతం బ్రాహ్మణులు ఉన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి చాలా మంది షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులోను బ్రాహ్మణుల గణాంకాలు ఇంతకుముందు క్రింద పేర్కొన్న పోస్టులోని ముస్లిం క్రిస్టియన్ ఉద్యోగుల సంఖ్యలను పోలి ఉన్నట్టు గమనించవచ్చు. అయితే క్రింద వివరించినట్టు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన రిజర్వేషన్లు ఉండవు. కావున, వివిధ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులలో బ్రాహ్మణుల ఎంతమందిఉన్నారు అని సమాచారం ఎక్కడా అందుబాటులో ఉండేది. కావున, ఈ పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
Published (23 November 2021):
ఢిల్లీ ఆఫీసుల్లో ముస్లిం క్రిస్టియన్ రిజర్వేషన్లతో వివిధ పోస్టుల్లో వారి సంఖ్యా బలం అంటూ ఒక పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. 2008లో సోనియాగాంధీ చేసిన చీకటి చర్యల వల్ల హిందూ ఉద్యోగుల సంఖ్య ఇలా ఉందంటూ పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2008లో డిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పోస్టుల్లో ముస్లిం క్రిస్టియన్ లకు రిజర్వేషన్స్ కల్పించిన సోనియాగాంధీ, తద్వారా హిందువుల సంఖ్యా బలం ఈ పోస్టుల్లో ఇలా తగ్గింది.
ఫాక్ట్: కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలోని పోస్టుల లిస్టు ఆయా కార్యాలయం వారి అధికారిక వెబ్సైటుల్లో లభిస్తాయి. రాష్ట్రపతి సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి లిస్టు చూసినప్పుడు, అందులో హిందువులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మతానికి సంబంధించి రిజర్వేషన్లు కల్పించినట్టు భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇటువంటి మతపరమైన రిజర్వేషన్లు ఉండవు. మతానికి ఇన్ని పోస్టులని ఎక్కడా కూడా విభజించరు; అటువంటి లిస్టు కూడా ప్రభుత్వం మైంటైన్ చేయదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలోని పోస్టుల లిస్టు ఆయా కార్యాలయం వారి అధికారిక వెబ్సైటుల్లో లభిస్తాయి. ఒక మూడు కార్యాలయాలను తీసుకొని పోస్టులో ఇచ్చిన క్లెయిమ్ లో ఉన్నది, వెబ్సైటులో ఉన్నదాన్ని పోల్చి చూడొచ్చు.
రాష్ట్రపతి సెక్రటేరియట్:
రాష్ట్రపతి సెక్రటేరియట్ కు సంబంధించిన వివిధ పోస్టులు మరియు లిస్టు ఆఫ్ ఆఫీసర్స్ అధికారిక వెబ్సైటులో చూడొచ్చు. పోస్టులో క్లెయిమ్ చేస్తున్న విధంగా ఉన్న మొత్తం 49 పోస్టులలో, ముస్లిం-క్రిస్టియన్ లను కలుపుకొని 45 అని, హిందువులకి మాత్రం పోస్టులు నాలుగేనని (4) చెబుతున్న విషయంలో ఎటువంటి నిజంలేదు. వెబ్సైటులో ఇచ్చిన డేటా ప్రకారం, ముఖ్యమైన ఎంప్లాయిస్ 36, ఇందులో ఎక్కువగా హిందువుల పేర్లు ఉన్నట్టు చూడొచ్చు.
ఉప రాష్ట్రపతి సెక్రటేరియట్:
ఉప రాష్ట్రపతి సెక్రటేరియట్ కు సంబంధించిన వివిధ పోస్టులు, లిస్టు ఆఫ్ ఆఫీసర్స్ అధికారిక వెబ్సైటులో చూడొచ్చు. పోస్టులో క్లెయిమ్ చేస్తున్న విధంగా ఉన్న మొత్తం 7 పోస్టులలో, ముస్లిం-క్రిస్టియన్ లను కలుపుకొని 7 మంది ఉన్నారని, హిందువులకి మాత్రం ఏ పోస్టులు లేవని (0) చెబుతున్న విషయంలో ఎటువంటి నిజంలేదు. వెబ్సైటులో ఇచ్చిన డేటా ప్రకారం, పూర్తి ఎంప్లాయిస్ 52, ఇందులో కూడా ఎక్కువగా హిందువుల పేర్లు ఉన్నట్టు చూడొచ్చు.
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివిధ పోస్టులు మరియు లిస్టు ఆఫ్ ఆఫీసర్స్ అధికారిక వెబ్సైటులో చూడొచ్చు. పోస్టులో క్లెయిమ్ చేస్తున్న విధంగా ఉన్న మొత్తం 35 పోస్టులలో, ముస్లిం-క్రిస్టియన్ లను కలుపుకొని 33 మంది ఉన్నారని, హిందువులకి మాత్రం రెండే పోస్టులు ఉన్నాయని (2) చెబుతున్న విషయంలో ఎటువంటి నిజంలేదు. వెబ్సైటులో ఇచ్చిన డేటా ప్రకారం, పూర్తి ఎంప్లాయిస్ సుమారు 49, ఇందులోనూ ఎక్కువగా హిందువుల పేర్లు ఉన్నట్టు చూడొచ్చు.
మతానికి సంబంధించి రిజర్వేషన్లు కల్పించినట్టు భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇటువంటి మతపరమైన రిజర్వేషన్లు ఉండవు. మతానికి ఇన్ని పోస్టులని ఎక్కడా కూడా విభజించరు; అటువంటి లిస్టు కూడా ప్రభుత్వం మైంటైన్ చేయదు.
చివరగా, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన రిజర్వేషన్లు ఉండవు; హిందూ ఉద్యోగులకు సంబంధించిన ఈ గణాంకాలు తప్పు.