రిజర్వేషన్లు పొందడానికి SC/STలకు ఎటువంటి ఆదాయ పరిమితి లేదు

“2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఎస్సీలు/ఎస్టీలు/బీసీలు (SC/ST/BC) రిజర్వేషన్లు పొందేందుకు అనర్హులు, కానీ 8 లక్షల వరకు ఆదాయం ఉన్న ఓసీ(OC)లు EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి అనుమతించబడ్డారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ/ఎస్టీ/బీసీలు రిజర్వేషన్లు పొందేందుకు అనర్హులు, కానీ 8 లక్షల వరకు ఆదాయం ఉన్న ఓసీ(OC)లు EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి అర్హులు.

ఫాక్ట్(నిజం): SC/STలు రిజర్వేషన్లు పొందేందుకు ఎటువంటి ఆదాయ పరిమితులు లేవు; బీసీ(BC)లకు, EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి ఓసీ(OC)లకు ఆదాయ పరిమితి 8 లక్షలుగా ఉంది. ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఇతర వెనుకబడిన తరగతులు (OBC)ల్లో ‘వెనుకబాటు నుంచి బయటపడిన’ (Creamy layer) వారికి రిజర్వేషన్లు మినహాయించటం 1993 నుండి అమలులోకి వచ్చింది. జనవరి 2019లో జనరల్ కేటగిరీ పేదలకు/అగ్రవర్ణ పేదలకు, అనగా ఎస్సీ/ఎస్టీ/బీసీ (SC/ST/BC) రిజర్వేషన్లు పొందని జనరల్ కేటగిరీలోని(OC) ప్రజలకు EWS కేటగిరీలో 10శాతం రిజర్వేషన్లు కలిపిస్తూ కేంద్ర ప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది ‘తప్పుదోవ’ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ/ఎస్టీ/బీసీలు రిజర్వేషన్లు పొందేందుకు అనర్హులా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వివిధ భారత ప్రభుత్వ వెబ్సైట్ల ప్రకారం విద్య, ఉద్యోగాల్లో నియామకాలలో SC/STలురిజర్వేషన్లు పొందేందుకు ఎటువంటి ఆదాయ పరిమితులు లేవని తెలిసింది. అలాగే బీసీ(BC)లు రిజర్వేషన్లు పొందడానికి ఆదాయ పరిమితి 8 లక్షలుగా ఉందని తెలిసింది, దీన్నే ఓబీసీ క్రీమీ లేయర్ (OBC Creamy layer) అంటారు. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి  సంబంధించిన విద్య, ఉద్యోగాల్లో నియామకాలలో ఎస్సీ(SC)లకు- 15%, ఎస్టీ(ST)లకు- 7.5%, బీసీ(OBC)లకు 27%, EWS కేటగిరీలో ఓసీ(OC)లకు/అగ్రవర్ణ పేదలకు – 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ).  

అయితే, వివిధ రాష్ట్రాలలో ఎస్సీ/ఎస్టీ/బీసీ (SC/ST/BC) రిజర్వేషన్లు భిన్న నిష్పత్తిలో అమలు అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

జనవరి 2019లో జనరల్ కేటగిరీ పేదలకు/అగ్రవర్ణ పేదలకు, అనగా ఎస్సీ/ఎస్టీ/బీసీ (SC/ST/BC) రిజర్వేషన్లు పొందని జనరల్ కేటగిరీలోని(OC) ప్రజలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (Economically Weaker Section,EWS) కేటగిరీలో 10శాతం రిజర్వేషన్లు కలిపిస్తూ కేంద్ర ప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ చేసింది (ఇక్కడ, ఇక్కడ).

ఎస్సీ/ఎస్టీ/బీసీ (SC/ST/BC) రిజర్వేషన్లు పొందని జనరల్ కేటగిరీకి చెంది 8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే EWS రిజర్వేషన్లు పొందడానికి అర్హులవుతారు. అలాగే రిజర్వేషన్లు పొందడానికి ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల లోపు ఇంటి స్థలం, మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ ప్లాట్ 100 చదరపు గజాల లోపు ఉండొచ్చు. నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 200 చదరపు గజాల్లోపు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి (ఇక్కడ).

ఓబీసీ క్రీమీ లేయర్ (OBC Creamy layer): 

ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఇతర వెనుకబడిన తరగతులు (OBC)ల్లో ‘వెనుకబాటు నుంచి బయటపడిన’ (Creamy layer) వారికి రిజర్వేషన్లు మినహాయించటం 1993 నుండి అమలులోకి వచ్చింది (ఇక్కడ). 1993లో ఈ క్రీమీ లేయర్ విధానాన్ని అమలులోకి తెచ్చినపుడు వార్షిక ఆదాయం రూ. 1 లక్షకు మించిన ఓబీసీలు రిజర్వేషన్‌కు అనర్హులు. అనంతరం 2004లో ఈ ఆదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు, 2008లో రూ. 4.5 లక్షలకు, 2013లో రూ. 6 లక్షలకు పెంచారు. 2017 సెప్టెంబర్‌లో ఈ క్రీమీ లేయర్ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంటే, వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటిన ఓబీసీలకు రిజర్వేషన్లు వర్తించవు.

క్రీమీ లేయర్ నిబంధన SC/ST లకు వర్తిస్తుందా?

01 ఆగస్ట్ 2024న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ సహా బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేల ఎమ్ త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా మరియు సతీష్ చంద్ర శర్మలతో కూడిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 6-1 మెజారిటీతో తీర్పును వెలువరించింది(ఇక్కడ, ఇక్కడ) . సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పు వెల్లడిస్తూ, SC/ST రిజర్వేషన్ల విషయంలో కొన్ని సూచనలు చేసింది. షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల పరిధి నుండి క్రీమీలేయర్‌ను మినహాయించాలని సుప్రీంకోర్టు అభిప్రాయం పడింది. ఎస్సీ, ఎస్టీలలోని ‘క్రీమీ లేయర్’పై జస్టిస్ బిఆర్ గవాయి మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వర్గాల్లో క్రీమీలేయర్‌ను గుర్తించి,  వారిని రిజర్వేషన్లు నుండి మినహాయించే విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా రూపొందించాలని అన్నారు. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న షెడ్యూల్డ్ కులాలు, తెగల్లో పలు కేటగిరీలు ఉన్నాయని, వారిని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని జస్టిస్ గవాయి అన్నారు. SC/STలలో క్రీమీలేయర్‌ను గుర్తించే ప్రమాణాలు ఇతర వెనుకబడిన కులాల (OBCలు) కి ఉపయోగించే ప్రమాణాలకు భిన్నంగా ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, 09 ఆగస్టు 2024న  జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఎస్సీ, ఎస్టీలకు క్రిమీలేయర్ వర్తింపు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు (ఇక్కడ, ఇక్కడ). ‘క్రీమీ లేయర్’కి చెందిన SC/ST/OBC వ్యక్తులు కొన్ని రకాల రిజర్వేషన్‌లకు అర్హులు కారు అని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో తెలిపింది (ఇక్కడ).

చివరగా, SC/STలురిజర్వేషన్లు పొందేందుకు ఎటువంటి ఆదాయ పరిమితులు లేవు; బీసీ(BC)లకు మరియు EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి ఓసీ(OC)లకు ఆదాయ పరిమితి 8 లక్షలుగా ఉంది.