శ్మశానవాటిక సేవలపై అసలు GST లేదు; 18 శాతం GST ఉన్నది శ్మశానవాటిక పనుల కాంట్రాక్టు మీద

చచ్చేటపుడు కొంచెం ఆలోచించి చావండి. శ్మశాన సేవలపై కూడా 18 శాతం GST ఉందట!”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: శ్మశానవాటిక సేవలపై 18 శాతం GST ఉంది.

ఫాక్ట్: శ్మశానవాటిక సేవలపై 18 శాతం GST లేదు. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక లేదా మార్చురీ సేవలపై GSTనే లేదు. 18 శాతం GST ఉన్నది శ్మశానవాటిక పనుల కాంట్రాక్టు మీద. ఇదే విషయం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా తెలిపారు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, 29 జూన్ 2022న జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో శ్మశానవాటిక పనుల కాంట్రాక్టు మీద GSTని 12 శాతం నుండి 18 శాతానికి మార్చినట్టు తెలిసింది. శ్మశానవాటిక సేవలపై 18 శాతం GST విధించినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

సెంట్రల్ జీఎస్‌టీ చట్టంలోని ‘షెడ్యూల్ III’లో అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక లేదా మార్చురీ సేవలపై అసలు GST వర్తించదని ఉన్నట్టు చూడవచ్చు. ఎందుకంటే వాటిని వస్తువుల సరఫరా లేదా సేవల సరఫరా లాగా పరిగణించరు.

శ్మశానవాటిక సేవలపై GST వర్తించదని చెప్తూ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, శ్మశానవాటిక సేవలపై 18 శాతం GSTనే లేదు. 18 శాతం GST ఉన్నది శ్మశానవాటిక పనుల కాంట్రాక్టు మీద.