Fake News, Telugu
 

ఈ వ్యాసాన్ని జస్టిస్ చిన్నప్ప రెడ్డికి ఆపాదించడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చిన్నప్ప రెడ్డి వ్రాసిన అద్భుతమైన శాస్త్రీయ వ్యాసం అంటూ ఒక వ్యాసాన్ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వ్యాసంలో చిన్నప్ప రెడ్డి ప్రస్తుతం దేశంలో నెలకొన్న అనేక సామాజిక అసమానతలు, రుగ్మతులను కొన్ని ఉదాహారణలతో విమర్శిస్తూ, తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తాడు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వ్యాసానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చిన్నప్ప రెడ్డి వ్రాసిన అద్భుతమైన శాస్త్రీయ వ్యాసం.

ఫాక్ట్(నిజం): జస్టిస్ చిన్నప్ప రెడ్డి సామాజిక రుగ్మతులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కొన్ని కథనాలు ఉన్నప్పటికీ, ఈ వ్యాసాన్ని ఆయనకు ఆపాదించడానికి ఎటువంటి ఆదారాలు లేవు. పైగా ఈ వ్యాసంలో ఉదాహారణలుగా పేర్కొన్న కొన్ని సంఘటనలు అయన చనిపోయినాక జరిగాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత న్యాయవ్యవస్థలో అత్యంత గౌరవనీయులైన సభ్యులలో జస్టిస్ చిన్నప్ప రెడ్డి ఒకరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చిన్నప్ప రెడ్డి మానవ హక్కులకు సంబంధించి అనేక క్రియాశీలమైన తీర్పులు ఇచ్చారు. జస్టిస్ రెడ్డి తనని తాను మార్క్సిస్ట్ గా అభివర్ణించుకొన్నాడు.

ఐతే జస్టిస్ రెడ్డి సామాజిక అసమానతలు, మూఢ నమ్మకాలు, వలసవాద విద్యావ్యవస్థ మొదలైన సామాజిక రుగ్మతులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కొన్ని బ్లాగ్స్ పేర్కొన్నప్పటికీ, పోస్టులో షేర్ చేసిన వ్యాసం జస్టిస్ చిన్నప్ప రెడ్డికి ఆపాదించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా ఈ బ్లాగ్స్ యొక్క విశ్వాసనీయత కూడా మనకు తెలియదు.

పైగా ఈ వ్యాసానికి సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, తన పుస్తకాలలో గానీ లేక ఇతర రచనలో జస్టిస్ చిన్నప్ప రెడ్డి ఇలా అభిప్రాయ పడ్డాడనడానికి మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

ఈ వ్యాసంలో పేర్కొన్న ఉదాహారణలు ఇటీవల కాలంలో జరిగినవి:

పైగా పోస్టులో షేర్ చేసిన వ్యాసంలో సమాజంలోని రుగ్మతుల గురించి మాట్లాడే క్రమంలో సమాజంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహారణలుగా పేర్కొన్నాడు. ‘చప్పట్లు కొట్టి వైరస్ ను చంపెయ్యమని పిలుపునిచ్చే నేతలు ఉన్న  దేశంలో  క్షుద్ర హత్యలు కాక వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా’  మరియు ‘మదనపల్లిలోని ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు ‘పునర్జన్మ’ల మీద నమ్మకంతో కన్నకూతుళ్లనే కడతేర్చిన ఘటన’.

ఐతే పైన తెలిపిన ఉదాహారణలు ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు. ‘చప్పట్లు కొట్టి వైరస్ ను చంపెయ్యమని పిలుపునిచ్చే నేతలు’ అన్నది కరోనాను ఉద్దేశించి కాగా, ‘పునర్జన్మల మీద నమ్మకంతో కన్నకూతుళ్లనే కడతేర్చిన ఘటన’ ఇటీవల 2021లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.

ఐతే జస్టిస్ చిన్నప్ప రెడ్డి ఏప్రిల్ 2013లోనే చనిపోయారు. కాబట్టి, పైన చెప్పిన ఉదాహారణల గురించి అయన ప్రస్తావించే అవకాశమే లేదు. దీన్నిబట్టి, ఈ వ్యాసాన్ని జస్టిస్ చిన్నప్ప రెడ్డికి ఆపాదించినట్టు అర్ధం చేసుకోవచ్చు.

అంతే కాదు, ఈ వ్యాసం జస్టిస్ చిన్నప రెడ్డి రాయలేదని, వివిధ ఘటనల మీద స్పందిస్తూ ‘ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజషన్’ (PDSO) సంస్థ కరపత్రంగా రాసి ఫిబ్రవరి 2021లో ప్రచురించామని ఆ సంస్థకు చెందిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

చివరగా, ఈ వ్యాసాన్ని జస్టిస్ చిన్నప్ప రెడ్డికి ఆపాదించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll