సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. 22 మే 2024న జరిగే సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించాలని కోరుతూ ఆహ్వానం అందిందని చెప్తూ ఈ వార్తను షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించాలని కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది.
ఫాక్ట్(నిజం): ఐక్యరాజ్య సమితి నుండి పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఆహ్వానం అందలేదు. అసలు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్ ప్రకారం 22 మే 2024న ఎలాంటి సమావేశం లేదని తెలుస్తుంది. అంతే కాదు, ఇదే వార్త గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ అవుతూ వస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పవన్ కళ్యాణ్ కు ఇలా ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందినట్టు మాకు ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు. ఒకవేళ నిజంగానే ఆహ్వానం వచ్చి ఉంటె, మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు.
నిజానికి ఈ వార్త ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతూ వస్తుంది. డిసెంబర్ 2022లో ఇదే వార్తను షేర్ చేసిన పలు సోషల్ మీడియా పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఇదిలా ఉండగా ఐక్యరాజ్య సమితి సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్‌లో మాత్రం 22 మే 2024న ఎలాంటి సమావేశం లేదని తెలుస్తుంది. వీటన్నిటి బట్టి ఐక్యరాజ్య సమితి నుండి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందిందన్న వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఐతే ఈ విషయానికి సంబంధించి మరింత స్పష్టత కోసం మేము ఐక్యరాజ్య సమితి వారిని మెయిల్ ద్వారా సంప్రదించాము, వారి నుండి వచ్చిన జవాబుకు అనుగుణంగా ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించాలని పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.