గోమాంసానికి సంబంధించి మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

గోమాంసం తినవచ్చని వేదాలు చెపుతున్నాయని’  RSS సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘గోమాంసం తినవచ్చని వేదాలు చెపుతున్నాయి’ – RSS సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్

ఫాక్ట్(నిజం): గోమాంసానికి సంబంధించి మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పైగా పోస్టులో ఆయనకు ఆపాదిస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతదేశం అంతటా గోహత్యను నిషేధించే చట్టాన్ని తేవాలని గతంలో డిమాండ్ చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

RSS సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ గతంలో పలు సందర్భాలలో మాంసం వినియోగానికి సంబంధించి తన అభిప్రాయాన్ని తెలిపాడు. మాంసం నిషేధానికి తాను మద్దతు తెలపనని, కాకపోతే ప్రజలే మాంసం వినియోగంలో నియంత్రణ పాటించాలని అన్నారు (ఇక్కడ & ఇక్కడ). ఎక్కువ హింసతో కూడిన ఆహారాన్ని తినకూడదని, అలా చేస్తే అది మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుందని అన్నారు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు ‘గోమాంసం తినవచ్చని వేదాలు చెపుతున్నాయి’ అన్న వ్యాఖ్యలు మోహన్ భగవత్ ఎప్పుడూ చేయలేదు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఒకవేళ RSS సర్‌సంఘ్‌చాలక్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి  ఉండేది, కాని మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు. పైగా పోస్టులో ఆయనకు ఆపాదిస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతదేశం అంతటా గోహత్యను నిషేధించే చట్టాన్ని తేవాలని గతంలో డిమాండ్ చేసారు.

ఐతే గతంలో ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి డీపీ త్రిపాఠి ‘గో మాంసం తినడం నేరమని వేదాలలో ఎక్కడా లేదని’, కావాలంటే ఈ విషయంపై తనతో చర్చకు రావాలని RSS సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్‌కు ఛాలెంజ్ చేసారు. బహుశా ఎన్సీపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు మోహన్ భగవత్‌కు ఆపాదించి ఉంటారు. కాని మోహన్ భగవత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

ఇంతకుముందు కూడా ఇలానే వేదాలు గోమాంసం తినడాన్ని అనుమతిస్తున్నాయని RSS పత్రిక ఆర్గనైజర్, ఒక కథనంలో పేర్కొన్నదని వార్తలు వచ్చాయి. ఐతే అప్పుడు ఆర్గనైజర్ రాసిన కథనాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం వల్ల ఈ వార్తలు మొదలయ్యాయని, కానీ నిజానికి ఆర్గనైజర్ అలా రాయలేదు అంటూ ఈ ఫాక్ట్-చెక్ తేల్చింది.

చివరగా, గోమాంసానికి సంబంధించి మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.