‘తెలుగు దిక్సూచి న్యూస్’ అనే ఈ- పేపర్ లేదు; ఆ పేరుతో వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్

ఫిబ్రవరి 2025లో దుబాయ్‌లో సినీ నిర్మాత కేదార్ ఆకస్మిక మరణం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, కేదార్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల అతని వ్యాపార భాగస్వామి, మిత్రుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేదార్ మరణానికి కారణం ఏంటని ఎందుకు విచారణ కోరడం లేదన్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో “కేదార్ ది సహజ మరణం కాదు హత్యే అని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దుబాయ్ పోలీసులు, ఆయన మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు దుబాయ్ పోలీసులు నోటీసులు పంపనున్నారు” అని ‘తెలుగు దిక్సూచి న్యూస్’ అనే ఈ-పేపర్ కథనం ప్రచురించింది అంటూ వార్త క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సినీ నిర్మాత కేదార్ ది సహజ మరణం కాదని, కేదార్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు దుబాయ్ పోలీసులు నోటీసులు పంపనున్నారు అని చెప్తున్న ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఉన్న ఒక న్యూస్ క్లిప్పింగ్.

ఫాక్ట్(నిజం): ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న ‘epaper.telugudiksuchinews.com’ డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కేదార్ ది సహజ మరణమే అని, కేదార్ మరణంపై ఎటువంటి అనుమానం లేదని దుబాయ్ పోలీసులు నిర్ధారించారని పలు వార్తాకథనాలు పేర్కొన్నాయి. అలాగే, కేదార్ బావమరిది రాజ్ UAE కి చెందిన మీడియా సంస్థ ‘’గల్ఫ్ న్యూస్’తో మాట్లాడుతూ, కేదార్ గుండెపోటుతో మరణించాడని పేర్కొన్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లలో పేర్కొన్నట్లుగా సినీ నిర్మాత కేదార్ ది సహజ మరణం కాదని దుబాయ్ పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. పైగా, కేదార్ ది సహజ మరణమే అని, కేదార్ మరణంపై ఎటువంటి అనుమానం లేదని దుబాయ్ పోలీసులు నిర్ధారించారని పేర్కొంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). UAE కి చెందిన మీడియా సంస్థ ‘గల్ఫ్ న్యూస్’ కథనం ప్రకారం, కేదార్ 25 ఫిబ్రవరి 2025న దుబాయ్‌లోని జుమేరా లేక్స్ టవర్స్ (JLT)లోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించాడు. కేదార్ బావమరిది రాజ్ ‘గల్ఫ్ న్యూస్’తో మాట్లాడుతూ, “కేదార్ మరణానికి సంబంధించిన అన్ని వివరాలు నాకు తెలియవు, కానీ అతను గుండెపోటుతో మరణించాడని నేను నిర్ధారించగలను” అని అన్నారు. కేదార్ అంత్యక్రియలను అతని కుటుంబ సభ్యులు 03 మార్చి 2025న దుబాయ్‌లోని జెబెల్ అలీలోని హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు.

ఇకపోతే వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న ‘తెలుగు దిక్సూచి న్యూస్’ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా ఈ పేరుతో ఉన్న ఎటువంటి ఈ- పేపర్ లభించలేదు (ఇక్కడ). స్థానిక ఈ- పేపర్లను పబ్లిష్ చేసే ‘Readwhere’ & ‘Magzter’ వంటి వెబ్‌సైట్‌లలో కూడా ఈ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. ఇక వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో ఇచ్చిన వెబ్ లింక్ కూడా మనుగడలో లేనట్లు గుర్తించాం.

అలాగే ‘epaper.telugudiksuchinews.com‘అనే డొమైన్ (వెబ్‌సైట్‌ యొక్క అడ్రస్) గురించి వివిధ డొమైన్ రిజిస్ట్రీ డేటాబేస్‌లలో వెతకగా ఈ పేరుతో ఎటువంటి డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదని, అలాగే ఈ డొమైన్ ప్రస్తుతం అందుబాటులో ఉందని తెలిసింది.

ఇంతకుముందు కూడా ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో పలు ఫేక్ న్యూస్ క్లిప్‌లు వైరల్ కాగా, ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో ఎటువంటి e-పేపర్ లేదని, అలాగే ఆ న్యూస్ క్లిప్పింగ్‌లలో ఉన్న వార్తలు కూడా ఫేక్ అని చెప్తూ Factly రాసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పై ఆధారాలను బట్టి, ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదని, ఈ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న న్యూస్ క్లిప్పింగ్ ఫేక్ అని మనం నిర్ధారించవచ్చు.