‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ- పేపర్ లేదు; ఆ పేరుతో వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్

Update (24 February 2025):

27 ఫిబ్రవరి 2025న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజిరెడ్డి చిన్నమైల్ బీసీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు “తెలంగాణ న్యూస్ టుడే” పేరుతో ఒక న్యూస్ క్లిప్పింగ్ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచారంలో ఉంది. అయితే ఈ పేరుతో ఎటువంటి వార్తా పత్రిక కానీ, ఈ- పేపర్ కానీ లేదు. వైరల్ పోస్టులో ఇచ్చిన లింక్ కూడా మనుగడలో లేదు. గతంలో కూడా “తెలంగాణ న్యూస్ టుడే” పేరుతో అనేక అసత్య వార్తా కథనాలు ప్రచారమయ్యాయి. అలాగే, ఇది ఫేక్ కథనం అని అంజిరెడ్డి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు.

ఆర్కైవ్ పోస్టుని క్కడ చూడవచ్చు

Update (12 February 2025):

“కాషాయం వైపు హరీష్ రావు చూపు” అనే శీర్షికతో “తెలంగాణ న్యూస్ టుడే” పేరుతో ఉన్న ఒక పోస్టు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్  హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. అయితే, ఇదివరకే నిరూపించినట్లుగా “తెలంగాణ న్యూస్ టుడే” పేరుతో ఎటువంటి పత్రిక లేదా ఈ- పేపర్ లేదు. గతంలో కూడా ఈ పేరుతో వివిధ సందర్భాల్లో నకిలీ వార్తా కథనాలు ప్రచారమయ్యాయి.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

Update (06 February 2025):

పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలని చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో యూట్యూబర్ మస్తాన్ సాయిని తెలంగాణ పోలీసులు 03 ఫిబ్రవరి 2025న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని చెప్తూ ‘తెలంగాణ న్యూస్ టుడే’ అనే పత్రిక పేరుతో ఒక పోస్టు (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే, క్రింది ఫాక్ట్-చెక్ ఆర్టికల్లో నిర్ధారించిన విధంగా ఈ పేరుతో వార్తా పత్రిక లేదు. ఈ పేరుతో గతంలో కూడా అనేక తప్పుడు కథనాలు ప్రచారం అయ్యాయి. మస్తాన్ సాయి కేసులో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

Update (31 January 2025):

ఇటీవల జనవరి 2025లో  హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకండా జరుగుతున్న అక్రమ కిడ్నీ మార్పిడులు వ్యవహారం బయటపడింది (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ వెనుక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారంటూ ‘తెలంగాణ న్యూస్ టుడే’ పత్రిక పేరుతో ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అయితే, ఈ న్యూస్ క్లిప్ ఫోటో ఫేక్, క్రింద ఫాక్ట్- చెక్ ఆర్టికల్ లో చెప్పినట్లుగా ‘తెలంగాణ న్యూస్ టుడే’ అనే పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. గతంలో కూడా ‘తెలంగాణ న్యూస్ టుడే’ పేరుతో అనేక నకిలీ వార్తా కథనాలు ప్రచారమయ్యాయి. సరూర్ నగర్ కిడ్నీ రాకెట్‌లో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR (కల్వకుంట్ల తారక రామారావు) పాత్ర ఉందని అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదు. అలాగే, వైరల్ పోస్టులో ఉన్న ఫోటో, ఆయన 2021లో వేములవాడలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నప్పటిది.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

Published (21 January 2025):

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పుకొని అమెరికాలో స్థిరపడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కకరికి రూ.1000 కోట్లు ఆఫర్ చేసినట్లు “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో ఉన్న రెండు ఈ- పేపర్ క్లిప్‌లు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.  

క్లెయిమ్: ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో ప్రచారమవుతున్న ఈ- పేపర్ కథనాలు.

ఫాక్ట్: ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లలో పేర్కొన్న ‘telangananewstodaydaily.com’ డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి అమెరికాలో స్థిరపడుతున్నట్లు విశ్వశనీయ మీడియా కథనాలు కానీ  అధికారిక సమాచారం కానీ మాకు లభించలేదు. అలాగే కేసీఆర్ తమకు వెయ్యి కోట్లు ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా ఉన్న మీడియా కథనాలు కూడా మాకు లభించలేదు. ఇక వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న “తెలంగాణ న్యూస్ టుడే” గురించి ఇంటర్నెట్లో వెతకగా ఈ పేరుతో ఉన్న ఎటువంటి ఈ- పేపర్ లభించలేదు.

స్థానిక ఈ- పేపర్లను పబ్లిష్ చేసే ‘Readwhere’ & ‘Magzter’ వంటి వెబ్సైట్లలో కూడా ఈ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. ఇక న్యూస్ క్లిప్పింగ్‌లలో ఇచ్చిన లింకులు(ఇక్కడ & ఇక్కడ) కూడా మనుగడలో లేనట్లు గుర్తించాం.

ఇక ‘telangananewstodaydaily.com’ అనే డొమైన్ (వెబ్సైట్ యొక్క అడ్రస్) గురించి వివిధ డొమైన్ రిజిస్ట్రీ డేటాబేస్‌లలో వెతకగా ఈ పేరుతో ఎటువంటి డొమైన్ రిజిస్టర్ కాలేదని, ప్రస్తుతం అమ్మకానికి ఉందని తెలిసింది.

అలాగే, డిసెంబర్ 2024లో కూడా ఇదే “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో కేటీఆర్, దివ్వెల మాధురి గురించి కూడా ఒక న్యూస్ క్లిప్ వైరల్ అయినప్పుడు, అది పూర్తిగా అవాస్తవమని మాధురి పేర్కొన్నారు. దీనికి సంబదించిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, పై ఆధారాలను బట్టి, “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” అనే ఈ- పేపర్ మనుగడలో లేదని, ఈ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్ అని నిర్ధారించవచ్చు.