‘బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి ని సస్పెండ్ చేస్తాం’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘సంచలన వ్యాఖ్యలు’ చేశారు అని చెప్తున్న న్యూస్ క్లిప్పింగ్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త 8 మార్చ్ 2025న ‘దశ’ అనే వార్తా పత్రికలో ఈ వార్త వచ్చినట్లు, ఈ పేపర్ క్లిప్ కింద భాగంలో ఉన్న దశ లోగో, డేట్ లైన్, వెబ్సైటు లింక్ సూచిస్తున్నాయి. గుజరాత్‌లో కొందరు కాంగ్రెస్ నాయకులు ‘బీజేపీతో కలిసి కుట్ర పన్నుతున్నారు’ అని రాహుల్ 9 మార్చ్ 2025న చేసిన వ్యాఖ్యల(ఇక్కడ,ఇక్కడ) నేపథ్యంలో ఇది సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ‘బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి ని సస్పెండ్ చేస్తాం’ అని రాహుల్ గాంధీ ‘సంచలన వ్యాఖ్యలు’ చేశారు: దశ న్యూస్ పేపర్.
ఫ్యాక్ట్: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గురించి ఈ విధంగా మాట్లాడినట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు. వైరల్ అవుతున్న పేపర్ క్లిప్పింగ్ ఎడిట్ చేసి తయారు చేసింది, ఇది నిజమైన న్యూస్ క్లిప్పింగ్ కాదు. అసలు దశ అనే ‘ఈ- పేపర్(డిజిటల్ వార్తా పత్రిక)’ లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
అసలు రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తాము అని అన్నారా లేదా అని, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, మాకు ఒక్క విశ్వసనీయ వార్తా కథనం కూడా దొరకలేదు. వైరల్ క్లెయిముని ఫాక్ట్ – చెక్ చేయడానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల అధికారిక ‘X’ ప్రొఫైల్స్ (ఇక్కడ, ఇక్కడ) చెక్ చేయగా, రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తాం అని వారు అన్నట్లు గానీ, ప్రకటన చేసినట్లు కానీ, మాకు ఒక్క ట్వీట్ కూడా లభించలేదు.
ఇకపోతే వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న ‘దశ’ న్యూస్ పేపర్ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా ఈ పేరుతో ఉన్న ఎటువంటి వార్తా వెబ్సైటు కానీ, ఈ- పేపర్ కానీ మాకు లభించలేదు. ఇక వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో ఇచ్చిన వెబ్ లింక్ కూడా మనుగడలో లేనట్లు మేము గుర్తించాం.
అలాగే ‘https://dashaheadlines.com‘ అనే డొమైన్ (వెబ్‌సైట్ యొక్క అడ్రస్) గురించి వివిధ డొమైన్ రిజిస్ట్రీ డేటాబేస్‌లలో వెతకగా (ఇక్కడ, ఇక్కడ), ఈ పేరుతో ఎటువంటి డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదని, అలాగే ఈ డొమైన్ ప్రస్తుతం అందుబాటులో ఉందని తెలిసింది.
గతంలో ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’, ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో పలు ఫేక్ న్యూస్ క్లిప్‌లు వైరల్ కాగా, ‘ఈ పేర్లతో ఎటువంటి e-పేపర్ లేదని, అలాగే ఆ న్యూస్ క్లిప్పింగ్‌లలో ఉన్న వార్తలు కూడా ఫేక్ అని చెప్తూ మేము ఫాక్ట్-చెక్ కథనాలను ప్రచురించాము. వాటిని మీరు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ‘దశ’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదని, ఈ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న న్యూస్ క్లిప్పింగ్ ఫేక్.