ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి ఈ పోస్టులో అందించిన ఓట్ల శాతం వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి

ఇటీవల వెల్లడైన 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి  మిగిలిన పార్టీల కన్నా ఎక్కువ ఓట్ల శాతం వచ్చిందని చెప్తున్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వైఎస్ఆర్సీపీకి మిగతాపార్టీల కన్నా ఎక్కువ ఓట్ల శాతం వచ్చినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పే ఉద్దేశంలో ఈ వార్తను షేర్ చేస్తున్నారు. సగటున వైఎస్ఆర్సీపీకి ప్రతి 100 మందిలో 40 మంది ఓటు వేయగా, టీడీపీకి 37 మంది, జనసేనకి 8 మంది అలాగే బీజేపీకి 2 వేసారని ఈ వార్తలో చెప్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వివరాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మిగిలిన పార్టీల కన్నా ఎక్కువ ఓట్ల శాతం వచ్చింది.

ఫాక్ట్(నిజం): 2024 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేయగా, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కన్నా కొంచెం ఎక్కువ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసింది. ఐతే టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు, అలాగే ఈ కూటమిలోని ఏదైనా పార్టీ పోటీ చేసిన స్థానంలో కూటమిలోని ఇతర పార్టీ ఓటు బదిలీ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఈ పార్టీల ఓట్ల శాతం అన్ని స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీతో పోల్చలేము. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల విడుదలైన 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో టీడీపీ కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలో వివిధ పార్టీల ఓట్ల శాతంకి సంబంధించి ఈ పోస్టులో షేర్ చేస్తున్న వివరాలలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే ఈ వివరాలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినయా లేక పార్లమెంట్‌కు సంబంధించినయా అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్/అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత ఓటింగ్ శాతం నమోదైందన్న వివరాలు కింద చూద్దాం.

అసెంబ్లీ ఓటింగ్ శాతం:

అసెంబ్లీ ఓటింగ్‌ను పరిశిలిస్తే పోస్టులో చేస్తున్న వాదనకు వ్యతిరేకంగా టీడీపీ అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేసింది. టీడీపీ 45.6% ఓట్ల శాతం నమోదు చేసుకోగా, ఆ తరవాత 39.37% ఓట్ల శాతంని వైఎస్ఆర్సీపీ నమోదు చేసుకుంది. జనసేన పార్టీ 6.87% & బీజేపీ 2.83%తో ఆ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. టీడీపీ, జనసేన & బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి కాబట్టి ఈ మూడు పార్టీల ఓట్ షేర్ కలిపితే 55.3%కు చేరుకుంది.

లోక్ సభ ఓటింగ్ శాతం:

ఇకపోతే లోక్ సభ ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే, దీంట్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేసిన పార్టీగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ 39.61% ఓటింగ్ ను నమోదు చేసుకోగా, టీడీపీ 37.79%తో రెండో స్థానంలో నిలిచింది. జనసేన మరియు బీజేపీ 4.32% & 11.28% ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్నాయి.  కూటమికి సంబంధించిన మూడు పార్టీల ఓటింగ్ శాతాన్ని కలిపితే 53.39%కు చేరింది.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టీడీపీ, జనసేన & బీజేపీ కూటమిగా ఏర్పడి స్థానాలను పంచుకున్నాయి. ఈ మూడు పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు, అలాగే ఈ కూటమిలోని ఏదైనా పార్టీ పోటీ చేసిన స్థానంలో కూటమిలోని ఇతర పార్టీ ఓటు బదిలీ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఈ పార్టీల ఓట్ల శాతంని అన్ని స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీతో పోల్చలేము. ఉదాహరణకు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాల్లో కేవలం 17 మాత్రమే పోటీ చేసింది. కాబట్టి వీరికి వచ్చిన ఓట్ల శాతం అన్ని, అంటే 25 స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీతో పోల్చలేము.

చివరగా, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి ఈ పోస్టులో అందించిన ఓట్ల శాతం వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయి.