ఒక రసాయనాన్ని నీటిలో కలపగా పాలవంటి తెల్లటి ద్రవంగా మారడాన్ని చూపించే వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. రైల్వే స్టేషన్‌లో పాలను ఈ విధంగా కల్తీ చేస్తున్నారంటూ ఈ వీడియోలో చెప్పబడింది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: కల్తీ పాల తయారీ ప్రక్రియని చూపించే వీడియో.
ఫాక్ట్: ఫినైల్ ఎమల్సిఫైయర్/కటింగ్ ఆయిల్ అనే తెల్లటి ద్రవాన్ని పొందడానికి టర్కీ రెడ్ ఆయిల్/మినరల్ ఆయిల్‌ను నీటితో కలపడం ఈ వీడియో చూపిస్తుంది. ఫినైల్ ఎమల్సిఫైయర్ వైట్ ఫినైల్స్ తయారీలో ఉపయోగించబడుతుంది. కటింగ్ ఆయిల్‌ని యంత్రాలకు కూలెంట్‌గా ఉపయోగిస్తారు. భారతదేశంలో పాల కల్తీలో ఈ రసాయనాలని వాడుతున్నారని సూచించే ఎటువంటి నివేదికలు లేవు. FSSAI ప్రకారం, కల్తీ పాలలో కనిపించే అత్యంత సాధారణ పదార్థాలు నీరు, యాంటీబయాటిక్స్, పురుగుమందులు, అఫ్లాటాక్సిన్ M1 మొదలైనవి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా ఇదే వీడియో కనీసం 2018 నుంచి ఈ రకమైన వాదనలతో వివిధ ప్రాంతాలకు చెందినదిగా ప్రచారంలో ఉండడం గమనించాం. దీని గురించి మరింత పరిశోధించగా, నీటిలో ఒక రసాయనాన్ని కలిపిన తర్వాత తెల్లటి ద్రవంగా మారడాన్ని చూపించే వీడియోలని (ఇక్కడ, ఇక్కడ) మేము యూట్యూబ్లో కనుగొన్నాం.
టర్కీ రెడ్ ఆయిల్‌ను నీటిలో కలిపినప్పుడు, తెల్లటి ద్రావణం ఏర్పడుతుంది. దీనిని సాధారణంగా తెలుపు ఫినైల్ తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా, మినరల్ ఆయిల్ నీటితో కలిపినప్పుడు తెల్లటి రంగు ద్రవంగా మారుతుంది, దీనిని కటింగ్ ఆయిల్ అంటారు. కటింగ్ ఆయిల్‌ని యంత్రాలలో కూలెంట్‌గా ఉపయోగిస్తారు. పాల కల్తీ ప్రక్రియలో వీటిని ఉపయోగించినట్లు సూచించే ఎటువంటి నివేదికలు మాకు లభించలేదు. అంతేకాకుండా, ఈ తెల్లటి ద్రవం యొక్క రుచి మరియు వాసన పాల కంటే పూర్తి భిన్నంగా ఉండడం వల్ల దీన్ని గుర్తించడం సులభం.
అయినప్పటికీ, దేశంలో పాల కల్తీ ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. 2019లో చేసిన FSSAI సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా సేకరించిన 6,432 పాల శాంపిల్స్‌లో 12 శాంపిల్స్ కల్తీ కారణంగా మానవ వినియోగానికి సురక్షితం కాదని తేలింది. 77 శాంపిల్స్‌లో పరిమితికి మించి యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయి. దాదాపు 5.7 శాతం శాంపిల్స్ అఫ్లాటాక్సిన్ M1 అవశేషాలతో కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. ఇది మేత ద్వారా పాలలోకి వచ్చే రసాయన పదార్థం. 12 కల్తీ నమూనాలలో, ఆరింటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్లు కనుగొనబడింది. మరికొన్నింటిలో డిటర్జెంట్, యూరియా లేదా న్యూట్రలైజర్‌లు ఉన్నాయి. పాల కల్తీలో ఉపయోగించే పదార్థాలు మరియు గుర్తించే పద్ధతులను తెలిపే నివేదికను ఇక్కడ చదవవచ్చు.
చివరిగా, వైరల్ వీడియోలో కనిపించే తెల్లటి ద్రవం ఫినైల్ ఎమల్సిఫైయర్/కటింగ్ ఆయిల్. ఇది పాల కల్తీ ప్రక్రియకి సంబంధించిన వీడియో కాదు.