పశ్చిమ బెంగాల్ BJP మేనిఫెస్టోలో రోహింగ్యాలకి ₹10,000ల ఆర్ధిక సహాయం చేస్తామని చెప్పలేదు

YouTube Poster

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా BJP మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో ‘పశ్చిమ బెంగాల్ లో రోహింగ్యాలకు 10 వేల ఆర్థిక సాయం’ చేస్తుందని BJP ప్రకటించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘పశ్చిమ బెంగాల్ లో రోహింగ్యాలకు 10 వేల ఆర్థిక సాయం’ చేస్తామని BJP ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): పశ్చిమ బెంగాల్ ఎన్నికలకి సంబంధించి BJP విడుదల చేసిన మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ఆధారంగా పౌరసత్వం పొందే శరణార్థుల సంక్షేమం కోసం ₹100 కోట్ల కార్పస్‌తో ‘ముఖ్యమంత్రి శరణార్థి కళ్యాణ్’  అనే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పథకం ద్వారా భారత పౌరసత్వం పొందిన ప్రతి శరణార్థ కుటుంబానికి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి ₹10,000 నగదు బదిలీ చేస్తామని మానిఫెస్టోలో తెలిపింది. ఐతే ఈ పథకం రోహింగ్యాలకు వర్తించదు, ఎందుకంటే CAA చట్టం ద్వారా రోహింగ్యాలు భారత పౌరసత్వం పొందలేరు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా 21 మార్చ్ 2021న బెంగాల్ కి సంబంధించి BJP ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసారు. ఈ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ఆధారంగా పౌరసత్వం పొందే శరణార్థుల సంక్షేమం కోసం ₹100 కోట్ల కార్పస్‌తో ‘ముఖ్యమంత్రి శరణార్థి కళ్యాణ్’  అనే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పథకం ద్వారా భారత పౌరసత్వం పొందిన ప్రతి శరణార్థ కుటుంబానికి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి ₹10,000 నగదు బదిలీ చేస్తామని మానిఫెస్టోలో తెలిపింది. ఇదే విషయాన్నీ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ మరియు టైమ్స్ అఫ్ ఇండియా కూడా ప్రచురించాయి.

ఐతే 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ద్వారా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుండి 31 డిసెంబర్ 2014  లేదా అంతకన్నా ముందు భారత దేశంలోకి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ లేదా క్రైస్తవ మతస్తులకు భారత దేశ్ పౌరసత్వం కల్పిస్తుంది. CAA చట్టం కింద భారత దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలకి పౌరసత్వం లభించదు. కాబట్టి బెంగాల్ కి సంబంధించిన BJP మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన  ‘ముఖ్యమంత్రి శరణార్థి కళ్యాణ్’  పథకం రోహింగ్యాలకి వర్తించదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, పశ్చిమ బెంగాల్ BJP మేనిఫెస్టోలో రోహింగ్యాలకి ₹10,000ల ఆర్ధిక సహాయం చేస్తామని పేర్కొనలేదు.