ఈ వీడియోలో మహిళలతో సన్నిహితంగా కనిపిస్తున్న వ్యక్తి హిందూ స్వామీజీ నిర్మల్ సింగ్ కాదు, శ్రీలంకకు చెందిన ఒక బౌద్ధ సన్యాసి

“సనాతన హిందూ స్వామీజీ అక్రమ రాసలీలలు” అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉండగా పట్టుబడిన దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ వీడియోకు హిందూ స్వామీజీ నిర్మల్ సింగ్ ఫోటో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందూ స్వామీజీ నిర్మల్ సింగ్ ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉండగా పట్టుబడిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని ఘటన జూలై 2023 శ్రీలంకలో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్నది హిందూ స్వామీజీ నిర్మల్ సింగ్ కాదు, పల్లెగామ సుమన థెరో అనే ఒక బౌద్ధ సన్యాసి. ఈ వార్తను శ్రీలంక వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఇదిలా ఉండగా నిర్మల్ సింగ్ స్వామీజీ 2007లో మరణించారు (మహా సమాధి). అంతేకాకుండా, నిర్మల్ సింగ్ స్వామీజీ ఇలా అమ్మాయిలతో సన్నిహితంగా పట్టుబడట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు శ్రీలంక వార్తా కథనాలు కనిపించాయి (ఇక్కడఇక్కడ ,& ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ ఘటన జూలై 2023లో శ్రీలంకలో చోటు చేసుకుంది. వైరల్ వీడియోలో ఉన్నది పల్లెగామ సుమన థెరో (Pallegama Sumana Thero)  అనే ఒక బౌద్ధ సన్యాసి అని ఈ కథనాలలో పేర్కొన్నారు.

ఈ వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ & ఇక్కడ), శ్రీలంకలోని నవగమువా ప్రాంతంలో పల్లెగామ సుమన థెరో ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు అతని నివాసంలోకి చొరబడి వీరిపై దాడి చేసారు. ఈ సమయంలో వీరు వీడియోలు కూడా తీసారు. ఐతే ఆ తరవాత ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే.

నిర్మల్ సింగ్ స్వామీజీ ఇలా అమ్మాయిలతో సన్నిహితంగా పట్టుబడట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా, నిర్మల్ సింగ్ స్వామీజీ (గురూజీ) 2007లో మరణించారు (మహా సమాధి) అని తెలిసింది (ఇక్కడ & ఇక్కడ). 2023లో ఇదే క్లెయింతో ఇదే వీడియో వైరల్ కాగా “ఇండియా టుడే” సంస్థ ఫాక్ట్-చెక్  విభాగం నిర్మల్ సింగ్ స్వామీజీఆశ్రమ వర్గాలను సంప్రదించగా, వారు ఈ వైరల్ వీడియోకు గురూజీకి ఎలాంటి సంబంధం లేదని, అలాగే దీనిపై ఆశ్రమ న్యాయ బృందం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

చివరగా, ఈ వీడియోలో మహిళలతో సన్నిహితంగా ఉండగా పట్టుబడిన వ్యక్తి హిందూ స్వామీజీ నిర్మల్ సింగ్ కాదు, శ్రీలంకకు చెందిన బౌద్ధ సన్యాసి.