దేశవ్యాప్తంగా వివిధ పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వివరాలను ఈ వైరల్ పోస్ట్ వివరిస్తుంది

ఇటీవల, 01 ఫిబ్రవరి 2025న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో “2025 కేంద్ర బడ్జెట్‌లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగా నిధులు కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వడ్డీ లేని రుణాలుగా రూ.1.5 లక్షల కోట్లు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.10,000 కోట్లు, ఉపాధి హామీ పథకం కోసం రూ.86,000 కోట్లు, గ్రామీణ సడక్ యోజన కింద రూ.16,600 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.9632 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో PM ఆవాస్ కింద ఇళ్ల నిర్మాణానికి రూ.19,794 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో PM ఆవాస్ కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 32,426 కోట్లు మరియు PM ఆవాస్ గృహ రుణ మాఫీకి రూ. 3500 కోట్లు కేటాయించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2025 బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.10,000 కోట్లు, ఉపాధి హామీ పథకం కోసం రూ.86,000 కోట్లు మరియు గ్రామీణ సడక్ యోజన కింద రూ.16,600 కోట్లు కేటాయించింది.

ఫాక్ట్(నిజం): 2025 బడ్జెట్‌లో వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలను వైరల్ పోస్ట్ చూపించడం లేదు. పోస్ట్‌లో పేర్కొన్న కేటాయింపులు దేశవ్యాప్తంగా ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులు, అంటే దేశవ్యాప్తంగా ఆయా పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

01 ఫిబ్రవరి 2025న, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి కేంద్ర వార్షిక బడ్జెట్‌ 2025-26ను (Union Budget 2025) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 50,65,345 కోట్లతో 2025-26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. 2025 కేంద్ర బడ్జెట్ గురించి పూర్తి సమాచారం కోసం మేము భారత ప్రభుత్వ వెబ్‌సైట్ www.indiabudget.gov.in ని సందర్శించాము.

నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో, ఈ 2025 బడ్జెట్‌లో క్రింద పేర్కొన్న 10 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు.

1) వ్యవసాయ వృద్ధి, ఉత్పాదకతను ప్రోత్సహించడం
2) గ్రామీణ సమృద్ధి, స్థితిస్థాపకతను నిర్మించడం
3) అందరినీ సమగ్ర వృద్ధి మార్గంలో కలిపి తీసుకెళ్లడం
4) తయారీలను ప్రోత్సహించడం, మేక్ ఇన్ ఇండియాను ముందుకు తీసుకెళ్లడం
5) MSMEలకు సహకారం
6) ఉపాధి ఆధారిత అభివృద్ధిని సుసాధ్యం చేయడం
7) ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టడం
8) శక్తి సరఫరాలను భద్రపరచడం
9) ఎగుమతులను ప్రోత్సహించడం
10) ఆవిష్కరణను పెంపొందించడం

అలాగే, 2025 బడ్జెట్‌ను పరిశీలిస్తే, శాఖల వారీగా కేటాయింపులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఇకపోతే వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 2025 బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వివిధ పథకాల క్రింద భారీగా నిధులు కేటాయించిందా? అని తెలుసుకోవడానికి 2025 బడ్జెట్‌ను పూర్తిగా అధ్యయనం చేయగా, పోస్టులో పేర్కొన్న కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆయా పథకాలకు కోసం చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులు అని తెలిసింది.

2025 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిందని వైరల్ పోస్ట్ పేర్కొంది. అయితే, కేంద్రం ఇంత మొత్తాన్ని వడ్డీ లేని రుణంగా తెలంగాణకు కేటాయించలేదు. 2025-26 బడ్జెట్‌లో మూలధన వ్యయం (capital expenditure), సంస్కరణలకు ప్రోత్సాహకాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాల కోసం కేంద్రం ప్రభుత్వం రూ.1,50,000 కోట్ల బడ్జెట్‌ వ్యయం ప్రతిపాదించబడింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి కేటాయించింది.

2025 బడ్జెట్‌లో తెలంగాణకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.10,000 కోట్లు కోట్లు కేటాయించబడింది అని వైరల్ పోస్ట్ పేర్కొంది. అయితే, ఈ పథకం కింద కేంద్రం తెలంగాణకు ఇంత మొత్తాన్ని కేటాయించలేదు, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది.

2025 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని MSME (సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థల)కు రాబోయే 5 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్ల రుణాలను కేటాయించిందని వైరల్ పోస్ట్ పేర్కొంది. అయితే, కేంద్రం ఇంత మొత్తాన్ని కేవలం తెలంగాణలోని సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థలకు మాత్రమే కేటాయించలేదు, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థలకు రాబోయే 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఇంత మొత్తంలో రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2025 బడ్జెట్‌లో పేర్కొంది.

2025 బడ్జెట్‌లో తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం (MGNREGS) అమలు కోసం ₹86,000 కోట్లు కేటాయించబడిందని వైరల్ పోస్ట్ పేర్కొంది. అయితే, ఈ పథకం కింద కేంద్రం తెలంగాణకు ఇంత మొత్తాన్ని కేటాయించలేదు, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది.

కేంద్రం 2025 బడ్జెట్‌లో తెలంగాణకు పట్టణ ప్రాంతాల్లో PM ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి రూ.19,794 కోట్లు మరియు PM ఆవాస్ గృహ రుణల మాఫీకి రూ. 3500 కోట్లు కేటాయించింది అని వైరల్ పోస్ట్ పేర్కొంది. అయితే, ఈ పథకాల కింద కేంద్రం తెలంగాణకు ఇంత మొత్తంలో నిధులను కేటాయించలేదు, దేశవ్యాప్తంగా ఈ పథకాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది.

కేంద్రం 2025 బడ్జెట్‌లో తెలంగాణకు గ్రామీణ సడక్ యోజన కింద రూ.16,600 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.9632 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో PM ఆవాస్ కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 32,426 కోట్లు కేటాయించింది అని వైరల్ పోస్ట్ పేర్కొంది. అయితే, ఈ పథకాల కింద కేంద్రం తెలంగాణకు ఇంత మొత్తంలో నిధులను కేటాయించలేదు, దేశవ్యాప్తంగా ఈ పథకాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. కేంద్రం 2025 బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా గ్రామీణ సడక్ యోజన అమలు కోసం రూ. 19,000 కోట్లు, వివిధ పెన్షన్ల (వృద్ధ్యప, వింతటువు మొదలైన పెన్షనల) నిమిత్తం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (National Social Assistance Progamme) కింద రూ.9652 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో PM ఆవాస్ కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 54,832 కోట్లు కేటాయించింది.

చివరగా, ఈ వైరల్ పోస్ట్‌ 2025 బడ్జెట్‌లో  దేశవ్యాప్తంగా వివిధ పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను తెలియజేస్తుంది.